Donald Trump Attacked: మన దేశంలో హింసకు తావు లేదు.. ట్రంప్‌పై కాల్పులను ఖండించిన అమెరికా అధ్యక్షుడు

No Place For This Kind Of Violence Biden On Shooting At Trump Rally

  • పార్టీలకు అతీతంగా ట్రంప్‌పై దాడిని ఖండించిన అమెరికా రాజకీయ నేతలు
  • ఇలాంటి హింస ముందెన్నడూ చూడలేదన్న అధ్యక్షుడు బైడెన్
  • రాజకీయాల్లో హింసకు తావులేదన్న మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా
  • దేశానికి తమ తండ్రిలాంటి హీరోనే కావాలన్న ట్రంప్ సంతానం

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన డోనాల్డ్‌ ట్రంప్‌పై కాల్పుల ఘటనను దేశాధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా ఖండించారు. తమ దేశంలో హింసకు తావులేదని అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై పార్టీలకు అతీతంగా నేతలు ముక్తకంఠంతో ఖండించారు. ఘటనపై స్పందించిన బైడెన్ ఇలాంటి రాజకీయ హింసను ముందెన్నడూ చూడలేదన్నారు. ఇది అస్సలు తగదని, అందరూ దీన్ని ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. త్వరలో ట్రంప్‌తో మాట్లాడతానని ఎక్స్ వేదికగా వెల్లడించారు. ట్రంప్, ఆయన కుటుంబం కోసం ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేర్కొన్నారు. ఈ అర్థరహిత కాల్పుల ఘటనకు తీవ్రంగా ప్రభావితమైనట్టు కామెంట్ చేశారు. 

దేశంలో రాజకీయ హింసకు ఎటువంటి తావు లేదని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. అసలేం జరిగిందనేది ఇంకా తెలియరాలేదని, అయితే, ట్రంప్ క్షేమంగా ఉన్నందుకు మనందరం సంతోషించాలని పేర్కొన్నారు. రాజకీయాల్లో పరస్పర గౌరవం, సంస్కారపూరిత వాతావరణం నెలకొల్పేందుకు మనందరం పునరంకితమవ్వాలని పిలుపునిచ్చారు. ఇదో పిరికపంద చర్య అని మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ వ్యాఖ్యానించారు. 

సెనెట్‌లో డెమోక్రటిక్ పార్టీ నేత చక్ షూమర్ కూడా ఘటనపై స్పందించారు. ట్రంప్‌పై దాడి గురించి తెలిసి భయోత్పాతానికి లోనైనట్టు చెప్పారు. ఆయన క్షేమంగా ఉన్నారని తెలిసి ఊపిరి పీల్చుకున్నట్టు చెప్పారు. ట్రంప్ క్షేమంగా ఉన్నందుకు అమెరికన్లందరూ దేవుడికి రుణపడి ఉన్నారని రిపబ్లికన్ నేత మిచ్ మెక్కానల్ పేర్కొన్నారు. ట్రంప్ క్షేమంగా ఉన్నందుకు ఆ దేవుడికి ధన్యవాదాలు చెబుతున్నానని హౌస్ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ వ్యాఖ్యానించారు. 

ట్రంప్‌పై కాల్పుల విషయం తెలిసి ఆయన సంతానం కూడా తల్లడిల్లిపోయింది. అమెరికాకు ఇలాంటి ఫైటర్ కావాలి అంటూ ఎరిక్ ట్రంప్ వ్యాఖ్యానించారు. చెంపపై రక్తం కారుతుండగా పిడికిలి బిగించి గర్జిస్తున్న ట్రంప్ ఫొటోను ఆయన షేర్ చేశారు. తండ్రి ప్రాణాలు కాపాడేందుకు వేగంగా స్పందించిన సీక్రెట్ సర్వీసు అధికారులకు ఇవాంకా ట్రంప్ ధన్యవాదాలు తెలిపింది. ఈ ఘటన తరువాత తన పూర్తి మద్దతు ట్రంప్‌కేనని ప్రముఖ టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News