Brain eating amoeba: కేరళలో ‘బ్రెయిన్ ఈటింగ్ అమీబా’ కేసులు.. అప్రమత్తంగా ఉండాలన్న నీలోఫర్ వైద్యులు

Nilofar doctors warns that be caution with brain eating amoeba

  • చెరువులు, కుంటలు, శుభ్రంలేని స్విమ్మింగ్‌పూల్స్‌కు దూరంగా ఉండాలని హెచ్చరిక
  • నీళ్ల నుంచి ముక్కు ద్వారా మెదడకు చేరే అవకాశం ఉంటుందని వార్నింగ్
  • ముందస్తు జాగ్రత్తగా నీలోఫర్‌లో ఏర్పాట్లు చేసిన వైద్యాధికారులు

కేరళలో ఇటీవల బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబాతో (మెదడు తినే అమీబా) ముగ్గురు చిన్నారులు చనిపోయిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ నీలోఫర్ వైద్యులు హెచ్చరించారు. చెరువులు, కుంటలు, శుభ్రం లేని స్విమ్మింగ్‌పూల్స్‌లో ఈతకొట్టవొద్దని సూచించారు. ఇలాంటి ప్రదేశాల్లోని నీటిలో ఉండే బ్రెయిన్ ఈటింగ్ అమీబా ముక్కు ద్వారా మెదడుకు చేరుతుందని హెచ్చరించారు.

నీలోఫర్‌లో ముందస్తు ఏర్పాట్లు..
తెలంగాణలో ఇంతవరకు కేసులు నమోదు కాకపోయినప్పటికీ ముందస్తు జాగ్రత్తగా నిలోఫర్‌ ఆసుపత్రిలో వైద్యులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. లక్షణాలు కనిపించిన పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అయితే మెదడు తినే అమీబా సోకిన రోగి నుంచి ఇంకొకరికి సోకదని చెప్పారు. అందుకే మురుగు కుంటలు, సక్రమంగా క్లోరినేషన్‌ చేయని వాటర్‌ పార్కులకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

వ్యాధి లక్షణాలు ఇవే
మెదడు తినే అమీబా సోకితే మెదడు వాపు వ్యాధి లాంటి లక్షణాలు కనిపిస్తాయని, తీవ్రమైన జ్వరం, తలనొప్పి, ఫిట్స్, వాంతులు ఉంటాయని సూచించారు. శరీరంలో అమీబా పెరిగితే కోమాలోకి వెళ్లి చనిపోయే ముప్పు అధికమని పేర్కొన్నారు. మెడ బిగుసుకుపోవడం, మనోభ్రాంతి, చుట్టూ జరిగే పరిస్థితులను గ్రహించలేకపోవడం లాంటి సమస్యలు వస్తాయని అన్నారు. ఈ అమీబా పిల్లలపైనే ఎక్కువ ప్రభావం చూపుతుందని, సోకిన వారిలో 97 శాతం మందికి పైగా ప్రాణాలు కోల్పోతారని నిపుణులు చెబుతున్నారు. 

వ్యాధి నిరోధకత తక్కువగా ఉండే పిల్లలు ఎక్కువగా దీని బారిన పడుతుంటారని తెలిపారు. అందుకే తీవ్రమైన తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు, ఫిట్స్‌ వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని అప్రమత్తం చేశారు.

  • Loading...

More Telugu News