Harish Rao: ఒకటో తేదీన ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తున్నారనేది వట్టి మాటే: హరీశ్ రావు
- మోడల్ స్కూల్ టీచర్లకు రెండు వారాలు గడిచినా వేతనాలు రాలేదన్న హరీశ్ రావు
- గెస్ట్ లెక్చరర్స్‌కు ఇచ్చిన హామీని అమలు చేయలేదని విమర్శ
- గెస్ట్ లెక్చరర్ల వ్యవస్థను ఎత్తేసే కుట్ర అన్న మాజీ మంత్రి
ఒకటో తేదీనే ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తున్నట్లుగా గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో మాత్రం అలసత్వం ప్రదర్శిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఒకటే తేదీన వేతనాలు చెల్లిస్తున్నామనేది కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితమైందని విమర్శించారు. మోడల్ స్కూల్ టీచర్లకు గత ఏడు నెలలుగా ఒకటో తేదీన వేతనాలు చెల్లించడం లేదన్నారు. ఇది కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి నిదర్శనమన్నారు.
ఈ నెలలో ఇప్పటికే రెండు వారాలు గడిచినప్పటికీ మోడల్ స్కూల్ రెగ్యులర్ టీచర్స్‌కు వేతనాలు అందలేదని, దీంతో వారు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 8న సగం మంది ఉద్యోగులకు మాత్రమే ప్రభుత్వం వేతనాలు చెల్లించిందన్నారు. చాలా ప్రాంతాల్లో వేతనాలు అందలేదన్నారు. మోడల్ స్కూల్స్‌లో పని చేసే ఔట్ సోర్సింగ్, అవర్లీ బేస్ట్ టీచర్స్ దాదాపు 2 వేల మందికి ప్రభుత్వం వేతనాలు చెల్లించలేదన్నారు. ఇప్పటికైనా స్పందించి వారికి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
జూనియర్ కాలేజీలలో పని చేసే గెస్ట్ లెక్చరర్స్‌కు ఇచ్చిన మాటను ప్రభుత్వం తప్పిందన్నారు. అధికారంలోకి రాగానే రూ.42 వేల వేతనం చెల్లిస్తామని చెప్పి... ఆ తర్వాత మాట తప్పిందన్నారు. పైగా వారిని మార్చి 31 నుంచి జులై 31 వరకే కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం దారుణమన్నారు. విద్యాసంవత్సరం మధ్యలో ఉద్యోగాలు నిలిపివేస్తే... వారు, వారి కుటుంబాలు ఏం కావాలని మండిపడ్డారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి విద్యాసంవత్సరానికి పొడిగింపు ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గెస్ట్ లెక్చరర్ల వ్యవస్థను ఎత్తేసేందుకు కుట్ర చేస్తున్నట్లుగా వారు ఆందోళన చెందుతున్నారని... ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాల్సి ఉందన్నారు. అభయహస్తం మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా గెస్ట్ లెక్చరర్లకు భరోసా ఇవ్వడంతో పాటు, నెలకు రూ. 42 వేల వేతనం చెల్లించి, విద్యాసంవత్సరం చివరి వరకు ఉద్యోగ కాలాన్ని పొడగించాలని డిమాండ్ చేశారు.