Alleti Maheshwar Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారు కానీ... షరతు విధిస్తున్నాం: బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి

BRS MLAs touch with BJP says Maheshwar Reddy

  • రాజీనామా చేసి రావాలని షరతు విధిస్తుండటంతో వెనుకడుగు వేస్తున్నారని వ్యాఖ్య
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బెదిరించి కాంగ్రెస్ చేర్చుకుంటోందని ఆరోపణ
  • రాష్ట్రంలో ఎప్పుడైనా... ఏమైనా జరగవచ్చని ఆసక్తికర వ్యాఖ్య

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలామంది బీజేపీతో టచ్‌లో ఉన్నారని... కానీ రాజీనామా చేసి రావాలని షరతు విధిస్తుండటంతో వెనకడుగు వేస్తున్నట్లుగా ఉందని బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బెదిరించి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎప్పుడైనా... ఏమైనా జరగవచ్చునని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి అవినీతి పాలనపై బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. ప్రజాక్షేత్రంలో వారి అవినీతిని ఎండగడతామన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా అమలు చేయలేదన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన 419 హామీలను ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో అతి తక్కువ కాలంలో అప్రతిష్ట మూటకట్టుకున్న ప్రభుత్వం కాంగ్రెస్‌ అన్నారు. కేంద్రం ఇచ్చిన అమృత్‌ పథకం నిధుల టెండర్లలో జరిగిన అవినీతిని నిరూపించేందుకు తాము సిద్ధమన్నారు. గ్లోబల్‌ టెండర్లలో 40 శాతం లెస్‌కు పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోతే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. 

రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలు ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. పాలనలో జవాబుదారీతనం... పారదర్శకత లేవన్నారు. పేరుకే ప్రజాపాలన అని విమర్శించారు. ప్రజాదర్బార్‌ కనిపించకుండా పోయిందన్నారు. ప్రజాపాలన పేరు మీద రాక్షస పాలన సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌ బాబా.. డజను దొంగలుగా పాలన తెలంగాణలో నడుస్తోందని విమర్శించారు.

  • Loading...

More Telugu News