Chandrababu: పార్టీ కార్యాలయంలో సీఎం చంద్రబాబుకు వినతుల వెల్లువ

Huge response for Chandrababu program in Mangalagiri TDP office

  • ప్రతి శనివారం మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుకు చంద్రబాబు
  • ఇవాళ కూడా చంద్రబాబు కోసం భారీగా తరలివచ్చిన ప్రజలు
  • అందరితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న ముఖ్యమంత్రి

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో వందల మంది నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వినతులు స్వీకరించారు. ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వెళుతున్న ముఖ్యమంత్రి... ఈ రోజు ఉదయం కూడా మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ కు వెళ్లారు. తన కోసం వేచి ఉన్న ప్రజలు, కార్యకర్తలను కలిశారు. 

ముందుగా గేటు వద్ద రాజమండ్రి నుంచి వచ్చిన దివ్యాంగుల నుంచి వినతిపత్రాలు తీసుకున్నారు. అనంతరం మీడియా రూంలో ప్రజలను, కార్యకర్తలను, వివిధ సమస్యలపై వచ్చిన వారిని కలిశారు. ఆరోగ్య సమస్యలు, భూ వివాదాలు, వ్యక్తి గత సమస్యలపై ప్రజలు సీఎంకు విన్నవించారు. 

ఇక కార్యకర్తలు, నేతలు నామినేటెడ్ పదవుల్లో తమకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబును కోరారు. 

నాడు తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేసిన బీమా మిత్రలు తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని కోరారు. 

విజయవాడకు చెందిన షేక్ ఆసిన్, మహ్మద్ ఇంతియాజ్ రాజధాని అమరావతి కోసం రూ.1 లక్ష విరాళంగా ఇచ్చారు. ఫర్నిచర్ షాపు నడుపుతున్న వీరు లక్ష విరాళం ఇవ్వడాన్ని చంద్రబాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఆశోక్ బాబు సహా పలువురు నేతలు పాల్గొన్నారు.

పాపకు రూ.16 కోట్ల ఇంజక్షన్ కోసం సాయం కోరిన బాధితులు

గుంటూరుకు చెందిన వెచ్చా ప్రీతమ్ దంపతులు తమ పాప హితైషిని తీసుకువచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. ఏడాది వయసున్న హితైషి తీవ్రమైన వ్యాధితో బాధపడుతోంది. స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న పాపకు చికిత్స కోసం వారు ముఖ్యమంత్రిని కలిశారు. 

పాపకు ఉన్న జబ్బు నయం కావాలి అంటే Zolgensma అనే ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. దీని ధర రూ.16 కోట్లు కావడంతో తల్లిదండ్రులు సాయం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఫండ్ రైజింగ్ కార్యక్రమం కూడా చేపట్టారు. మరో నెల రోజుల్లో ఈ చికిత్స అందించాల్సి ఉందని తల్లిదండ్రులు ముఖ్యమంత్రికి తెలిపారు. దీనిపై వెంటనే పరిశీలన జరుపుతామని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారు.

అనంతరం తన ఛాంబర్ లో నేతలను చంద్రబాబు కలిశారు. పార్టీ అంశాలపై వారితో చర్చించారు.

  • Loading...

More Telugu News