By Polls Results: ఉప ఎన్నికల ఫలితాలు: జలంధర్ వెస్ట్‌లో ఆప్ గెలుపు.. మిగతా చోట్ల ఇండియా కూటమి హవా

AAP wins Jalandhar West and INDIA bloc gives tough fight to BJP

  • ఏడు రాష్ట్రాల్లోని 13 స్థానాలకు ఈ నెల 10న ఉప ఎన్నికలు
  •  పశ్చిమ బెంగాల్‌లోని నాలుగు స్థానాల్లోనూ టీఎంసీ హవా
  • హిమాచల్ ప్రదేశ్‌లో అనూహ్యంగా లీడ్‌లోకి దూసుకొచ్చిన కాంగ్రెస్

ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 10న జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ ఉదయం మొదలు కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తొలి విజయాన్ని నమోదు చేసింది. మిగతా 12లో 10 స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 

లోక్‌సభ ఎన్నికల తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికల ఫలితాలు బీజేపీకి లిట్మస్ టెస్ట్‌లా మారాయి. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ మార్కు అందుకోలేకపోయిన బీజేపీ, మెజార్టీ మార్కుకు చేరువగా వచ్చిన కాంగ్రెస్ కూటమి ఈ ఎన్నికలను సవాలుగా తీసుకున్నాయి.

పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, పంజాబ్, బీహార్‌లలో ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. పశ్చిమ బెంగాల్‌లోని బాగ్డా, రాణాఘాట్, మణిక్తల, రాయ్‌గంజ్‌లోని నాలుగు స్థానాల్లోనూ అధికార తృణమూల్ కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. 

ఉత్తరాఖండ్‌లోని మంగ్లావుర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఖాజీ నిజాముద్దన్ తన సమీప బీఎస్పీ అభ్యర్థి ఉబేదెర్ రెహ్మాన్‌పై 12,540 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు. బద్రీనాథ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి లఖ్‌పత్ సింగ్ బుటోలా లీడ్‌లో ఉన్నారు.  పంజాబ్‌లోని జలంధర్ వెస్ట్‌లో ఆప్ అభ్యర్థి మొహిందర్ భగత్ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై 37,325 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక్కడి నుంచి విజయం సాధించిన ఆప్ ఎమ్మెల్యే శీతల్ అంగురల్ బీజేపీలో చేరడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. 

తమిళనాడులోని విక్రవంది అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార డీఎంకే అభ్యర్థి అన్నియూర్ శివ లీడింగ్‌లో ఉన్నారు. బీహార్‌లో జేడీయూ అభ్యర్థి కళాధర్ ప్రసాద్  మండల్ 2,433 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 

మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లా అమర్వారా నియోజకవర్గంలో బీజేపీ ఆధిక్యంలో ఉండగా,  హిమాచల్ ప్రదేశ్‌లో తొలుత వెనకబడిన కాంగ్రెస్ పుంజుకుని ఆధిక్యంలోకి దూసుకొచ్చింది. ఇక్కడ మూడు స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. డేహ్రాలో తొలుత వెనకబడిన సీఎం సుఖ్విందర్ సుఖు భార్య కమలేశ్ ఠాకూర్ 16,984 ఓట్లతో ఆధిక్యంలోకి దూసుకొచ్చారు.

More Telugu News