Pakistan: బాలికల చదువును తప్పుబడుతూ పాక్ యూట్యూబర్ పాట.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

Pakistani YouTubers Song Condemning Girls Education Sparks Outrage Online

  • స్కూళ్లలో ఆడపిల్లలు డ్యాన్సులు చేస్తారని వాదన
  • ఇది తమ మతానికి వ్యతిరేకమంటూ వాదన
  • ఆడపిల్లలను బడి మాన్పించాలనే సందేశంతో పాటను రూపొందించినట్లు వెల్లడి

అతివలు అన్ని రంగాల్లో  దూసుకెళ్తున్నా ఇంకా కొందరు మత ఛాందసవాదులు అమ్మాయిల చదువుపై అభ్యంతరం చెబుతూనే ఉన్నారు. తాజాగా పాకిస్థాన్ లో ఓ యూట్యూబర్ బాలికలను స్కూళ్లకు పంపడాన్ని తప్పుబడుతూ ఏకంగా ఓ వీడియో సాంగ్ ను యూట్యూబ్ లో విడుదల చేశాడు. హఫీజ్ హసన్ ఇక్బాల్ ఛిస్తీ అనే యూట్యూబర్ తన పాటకు ‘అప్నీ దీ స్కూలో హాతా లే ఓథీ డ్యాన్స్ కర్దీ పాయీ ఆయీ’  అనే పేరుపెట్టాడు.

‘మీ అమ్మాయి స్కూల్లో డ్యాన్స్ చేస్తున్నందున ఆమెను బడి మాన్పించండి’ అన్నది ఆ పాట సారాంశం. ఇస్లాం మతాచారం ప్రకారం అమ్మాయిలు డ్యాన్సులు చేయడం ఏమాత్రం అంగీకారయోగ్యం కాదని ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. స్కూళ్లకు వెళ్లడం వల్ల బాలికలు పవిత్రత, గౌరవం కోల్పోతారని సూత్రీకరించాడు. యునెస్కో సూచనతో పాక్ లోని ఓ స్కూల్ బాలికలకు డ్యాన్స్ పోటీ నిర్వహించినట్లు ఓ వార్తాసంస్థ చూపించడంతో పాట మొదలవుతుంది. అందుకు ప్రతిగానే ఈ పాటను జూన్ లో రూపొందించినట్లు యూట్యూబర్ పేర్కొన్నాడు.

అతను స్వరపరిచిన ఆ పాటలోని సాహిత్యం కూడా తీవ్ర అభ్యంతరకరంగా ఉంది. తమ ఇళ్లలోని అమ్మాయిలను వేశ్యలుగా మార్చాలనుకొనే వారు తప్ప ఎవరూ స్కూళ్లకు పంపొద్దని సూచించేలా పాట ఉంది. ఈ వీడియోకు సుమారు 3 లక్షల వ్యూస్, 3 వేలకుపైగా లైక్ లు రావడం పాక్ లో మతఛాందసవాదం ఎంతగా వేళ్లూనుకుపోయిందో చెప్పకనే చెప్పింది.

మరోవైపు ఈ వీడియోపై చాలా మంది నెటిజన్లు భగ్గుమంటున్నారు. పాకిస్థాన్ ఏ దిశగా వెళ్తోందంటూ విమర్శిస్తున్నారు.

‘ఇలాంటి మానసిక రుగ్మతలతో పాకిస్థాన్ ఇంకా బాధపడుతున్నందుకు విచారం వ్యక్తం చేస్తున్నా. ఇలాంటి వ్యక్తికి మద్దతిస్తున్న వ్యక్తులు వారి ఆడపిల్లల గురించి దేశం గురించి ఆలోచించుకోవాలి’ అని ఓ యూజర్ వ్యాఖ్యానించారు. ‘మన సోదరీమణులపై ఇంతటి నీచ పదజాలాన్ని వాడటానికి ఎంత ధైర్యం? అతన్ని కఠినంగా శిక్షించాలి’ అని మరొకరు డిమాండ్ చేశారు. ఇంకొకరు స్పందిస్తూ పాక్ లో 75 శాతం మంది ఇలాంటి అతివాద మనస్తత్వంతోనే ఉన్నారు. అందుకే ప్రపంచ దేశాలతో పోలిస్తే పాకిస్థాన్ ఇంకా అభివృద్ది చెందలేదు’ అని విమర్శించారు.

  • Loading...

More Telugu News