Snake bite: 40 రోజుల్లో ఏడుసార్లు పాము కరిచిందంటున్న వ్యక్తి.. వాస్తవాన్ని తేల్చడానికి విచారణకు ఆదేశం!

UP Man Bitten By Snake For Seventh Time In 40 Days Team Formed To Probe Case

  • యూపీలోని ఫతేపూర్ లో విచిత్ర ఘటన
  • ఆర్థిక సాయం చేయాలంటూ అధికారులను వేడుకున్న బాధితుడు
  • వైద్యం కోసం బోలెడు డబ్బు ఖర్చు చేశానంటూ కంటతడి
  • ప్రభుత్వ ఆసుపత్రిలో పాముకాటుకు ఉచిత చికిత్స ఉందని సూచించిన అధికారులు
  • ఈ ఘటనపై నిజానిజాలు తెలుసుకొనేందుకు దర్యాప్తు చేపడతామని వెల్లడి

ఉత్తరప్రదేశ్ లోని ఫతేపూర్ జిల్లాలో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. వికాస్ దూబే అనే 24 ఏళ్ల యువకుడిని 40 రోజుల వ్యవధిలో ఏకంగా ఏడుసార్లు పాము కాటేసింది. అది కూడా ఎక్కువగా శనివారాల్లోనే పాముకాటుకు గురయ్యాడు. దీంతో ప్రతిసారీ బాధితుడు వైద్యం కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రికి పరుగు తీశాడు. చివరకు చికిత్స కోసం డబ్బంతా ఖర్చు కావడంతో తనను ఆదుకోవాలంటూ జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చి అధికారులను వేడుకున్నాడు. 40 రోజుల్లో పాముకాటుకు గురైన వైనాన్ని వారికి వివరిస్తూ బోరుమని విలపించాడు. ఆర్థిక సాయం అందించాలని కోరాడు.

మరోవైపు ఈ ఘటనపై చీఫ్ మెడికల్ ఆఫీసర్ రాజీవ్ నయన్ గిరి స్పందించారు. పాముకాటుకు గురైనప్పుడు ఉచితంగా యాంటీ వీనమ్ మందును అందించే ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించాలని సూచించినట్లు చెప్పారు. అలాగే ప్రతి శనివారం అతను పాముకాటుకు గురవడం విచిత్రంగా ఉందన్నారు.

‘అతన్ని కాటేస్తున్నది ఇంతకీ పామో కాదో నిర్ధారించాల్సి ఉంది. అలాగే అతనికి చికిత్స అందిస్తున్న వైద్యుడి సామర్థ్యాన్ని కూడా పరిశీలించాల్సి ఉంది. శనివారాలు పాముకాటుకు గురైన వ్యక్తి ప్రతిసారీ ఒకే ఆసుపత్రిలో చేరడం.. అతను ఒకే రోజులో కోలుకొని డిశ్చార్జి కావడం విచిత్రంగా తోస్తోంది. దీనిపై నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు ముగ్గురు వైద్యుల బృందాన్ని ఏర్పాటు  చేశాం’ అని రాజీవ్ నయన్ గిరి చెప్పారు. దర్యాప్తు అనంతరం ప్రజలకు వాస్తవాలు వివరిస్తామన్నారు.

  • Loading...

More Telugu News