Prachanda: విశ్వాస పరీక్షలో ఓడిపోయిన నేపాల్ ప్రధాని ప్రచండ

Nepal PM Prachanda lost trust of vote

  • నేపాల్ లో కొనసాగుతున్న రాజకీయ అస్థిరత
  • గత 16 ఏళ్లలో 13 ప్రభుత్వాలు
  • ప్రధాని ప్రచండకు మద్దతు ఉపసంహరించుకున్న సీపీఎన్ (యూఎంఎల్)
  • కుప్పకూలిన ప్రభుత్వం
  • విశ్వాస పరీక్షలో ప్రచండకు అనుకూలంగా 63, వ్యతిరేకంగా 194 ఓట్లు

నేపాల్ లో రాజకీయ సంక్షోభాలకు, రాజకీయ అనిశ్చితికి ఇప్పట్లో తెరపడేట్టు కనిపించడంలేదు. తాజాగా, విశ్వాస పరీక్షలో ప్రధాని పుష్ప కమల్ దహల్ 'ప్రచండ' (69) ఓడిపోయారు. నేపాల్ ప్రభుత్వానికి మద్దతుగా 63 మంది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా 194 మంది ఓటు వేశారు. నేపాల్ పార్లమెంటు మొత్తం 275 సీట్లను కలిగి ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 138 మంది మద్దతు అవసరం. 

కొన్ని రోజుల కిందట కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్)... ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుని, నేపాల్ కాంగ్రెస్ తో జట్టుకట్టింది.. దాంతో నేపాల్ సర్కారు కుప్పకూలింది. ప్రచండ నాయకత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్ట్ సెంటర్) అధికార బదలాయింపు ఒప్పందం పాటించకపోవడంతో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్)ఈ నిర్ణయం తీసుకుంది. 

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ మార్కిస్ట్ లెనినిస్ట్) కు మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి నాయకత్వం వహిస్తున్నారు. 

పార్లమెంటులో బల పరీక్ష ఏర్పాటు చేయగా... ప్రధాని ప్రచండకు ఓటమి తప్పలేదు. ప్రచండ నేపాల్ ప్రధానిగా 2022లో బాధ్యతలు చేపట్టారు. నేపాల్ లో గత 16 ఏళ్లలో 13 ప్రభుత్వాలు మారాయి. 

విశ్వాస పరీక్షలో ప్రచండ ఓడిపోయిన నేపథ్యంలో... నేపాల్ లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్), నేపాల్ కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడేందుకు మార్గం సుగమం అయింది. తదుపరి ప్రధాని కేపీ శర్మ ఓలీ అని నేపాల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

  • Loading...

More Telugu News