Perni Nani: తల్లికి మాత్రమే వందనం... పిల్లలందరికీ పంగనామాలు!: పేర్ని నాని
- కూటమి నేతలు ప్రజలకు హ్యాపీగా ఉండే మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారన్న పేర్ని నాని
- కూటమి నేతలు ఫుల్ హ్యాపీ... ప్రజలు అన్ హ్యాపీ అంటూ వ్యాఖ్యలు
- జగన్ పథకాన్ని కాపీ కొట్టి తల్లికి వందనం పథకం తీసుకువచ్చారని వెల్లడి
కూటమి నేతలు ప్రజల చెవులకు హ్యాపీగా ఉండే మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని, కానీ ఇప్పుడు కూటమి నేతలు ఫుల్ హ్యాపీగా ఉన్నారే తప్ప, ప్రజలు హ్యాపీగా లేరని వైసీపీ నేత పేర్ని నాని వ్యాఖ్యానించారు. జగన్ మోహన్ రెడ్డి పథకం అమ్మ ఒడిని కాపీ కొట్టి తల్లికి వందనం అని పేరు మార్చి తీసుకువచ్చారని పేర్ని నాని విమర్శించారు.
"ఈ ఫుల్ హ్యాపీగా ఉన్న వాళ్లను ఒకటి అడుగుతున్నా... జీవో ఎంఎస్.29 పేరుతో తల్లికి వందనం పథకం తీసుకువచ్చారు. వాస్తవంగా ఇది జగన్ మోహన్ రెడ్డి పథకం... అమ్మ ఒడి పథకాన్ని పేరు మార్చి కాపీ కొట్టి తల్లికి వందనం అని పెట్టారు. జగన్ ఒక్కరికే ఇచ్చాడు... మేం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఇస్తాం అని చెప్పారు. ఒకరైతే రూ.15 వేలు, ఇద్దరైతే రూ.30 వేలు, ముగ్గురైతే రూ.45 వేలు, నలుగురైతే రూ.60 వేలు ఇస్తాం అన్నారు.
నిజమే... చంద్రబాబు నాయకత్వంలోని ఈ కూటమి ప్రభుత్వంలో తల్లికి మాత్రమే వందనం... పిల్లలందరికీ పంగనామాలు. కూటమి నేతలైన చంద్రబాబు, పవన్ కల్యాణ్, జేపీ నడ్డా, పురందేశ్వరి... అందరూ కలిసి పిల్లలకు పంగనామాలు పెట్టారు. జనాలను మోసం చేయడం తప్ప ఇది మరొకటి కాదు.
ఓ సినిమాలో డైలాగు ఉంది... ఇది కూడా కూటమి డైలాగే... ఆరడుగుల బుల్లెట్ అంట... ఆరడుగుల అబద్ధం ఎవరయ్యా అంటే అది చంద్రబాబే. 2014 మేనిఫెస్టో చూసినా, 2024 మేనిఫెస్టో చూసినా అంతా మోసం, దగా!" అంటూ పేర్ని నాని విమర్శించారు.