Prakash Goud: చంద్రబాబు మళ్లీ సీఎం కావడం ఆనందంగా ఉంది: తెలంగాణ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్

 Prakash Goud says will join congress

  • చంద్రబాబు తన రాజకీయ గురువు అన్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే
  • తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వెల్లడి
  • చంద్రబాబును కలిశాకే పార్టీ మారుతున్నాననే ప్రచారంలో వాస్తవం లేదని వెల్లడి
  • భయపడేందుకు తాము చిన్నపిల్లలం కాదంటూ కేటీఆర్ కు కౌంటర్

తన రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడం తనకు ఆనందంగా ఉందని తెలంగాణలోని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. ఆయన శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

ఆనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... స్వామి వారి దర్శనం అనంతరం తాను కీలక నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని తెలిపారు. చంద్రబాబు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి గురించి నిత్యం పరితపించే వ్యక్తి అని కితాబునిచ్చారు.

రేవంత్ రెడ్డికి మా అవసరం లేదు

రేవంత్ రెడ్డికి స్పష్టమైన మెజార్టీ ఉందని, వారికి తమ అవసరం లేదన్నారు. కేవలం నియోజకవర్గ సమస్యల కోసమే తాను అధికార పార్టీలో చేరుతున్నానన్నారు. చంద్రబాబును కలిసిన తర్వాతే తాను పార్టీ మారాలనే నిర్ణయం తీసుకున్నాననే ప్రచారాన్ని ఆయన కొట్టి పారేశారు. ఆయన ఎక్కడ ఉన్నా తెలుగు రాష్ట్రాల బాగు కోరుకుంటారన్నారు. చంద్రబాబు తన రాజకీయ గురువు కావడంతో కలిశానన్నారు.

ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే అధికార పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. తన నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని... వాటి పరిష్కారం కోసం ముఖ్యమంత్రిని కలిశానన్నారు. అధికార పార్టీలో ఉంటే సమస్యలు పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్

గతంలో కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి కోసం పని చేశామన్నారు. ఎవరి పైనా బురదజల్లేది లేదని స్పష్టం చేశారు. భయభ్రాంతులకు గురిచేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ చేర్చుకుంటోందన్న కేటీఆర్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. భయపడటానికి తాము చిన్నపిల్లలం కాదన్నారు. తమకు ఎక్కడా ఒత్తిడి లేదని, తమ ఇష్ట ప్రకారమే కాంగ్రెస్‌లోకి వెళ్తున్నామన్నారు. 

ఇంకా ఎవరైనా పార్టీ మారుతారా? అనే అంశంపై తనకు స్పష్టత లేదన్నారు. రేవంత్ రెడ్డి యువకుడు... తెలివైనవాడు... ప్రజాసమస్యలు తెలిసినవాడు... మరో 10 ఏళ్లు అధికారంలో ఉంటాడని విశ్వాసం వ్యక్తం చేశారు. అందుకే తన నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చుననే తాను వెళుతున్నానన్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు ముఖ్యమంత్రి మంచి గౌరవం ఇస్తాడని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రితో తనకు మంచి సాన్నిహిత్యం ఉందని, అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News