Japan laughing Law: రోజుకోసారైనా నవ్వాల్సిందే.. ఏకంగా చట్టం చేసిన జపాన్

Japanese Prefecture Passes New Law Encouraging Residents To Laugh Daily

  • శారీరక, మానసిక ఆరోగ్యం పెంచేందుకేనని సమర్థింపు
  • ఉత్తర్వులు జారీ చేసిన యమగట ప్రిఫెక్చర్ ప్రభుత్వం
  • అయితే తప్పనిసరి మాత్రం కాదని వివరణ
  • ప్రజల హక్కులను కాలరాయొద్దంటూ మండిపడుతున్న నేతలు

నవ్వుతూ నవ్విస్తూ ఉంటే ఆరోగ్యంగా ఉండొచ్చని వైద్యులు చెబుతుంటారు.. అయితే, తప్పకుండా నవ్వాల్సిందేనని ఆదేశిస్తే ఎలా ఉంటుంది..? పైగా రోజుకు ఒక్కసారైనా కచ్చితంగా నవ్వాల్సిందేనని చట్టం కూడా చేస్తే..? ఇదెక్కడి విడ్డూరమని అనిపిస్తుంది కదా! ఇలాంటి విడ్డూరమైన చట్టం తీసుకొచ్చింది జపాన్ ప్రభుత్వం. పౌరుల శారీరక, మానసిక ఆరోగ్యం కోసమేనని సమర్థించుకుంటోంది. అయితే, నవ్వొస్తే నవ్వుతారు కానీ తప్పకుండా నవ్వాల్సిందేనని చట్టం తేవడమేంటని అక్కడి రాజకీయ నేతలు విమర్శిస్తున్నారు. ఇలాంటి చట్టాలతో ప్రజల హక్కులను కాలరాయొద్దని తీవ్రంగా మండిపడుతున్నారు. 

చట్టం తెచ్చింది ఎక్కడంటే..
జపాన్ లోని యమగట ప్రిఫెక్చర్ ప్రభుత్వం తాజాగా ‘లాఫింగ్ లా’ తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం.. పౌరులు రోజుకు కనీసం ఒక్కసారైనా నవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. యమగట యూనివర్సిటీలోని ‘ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసిన్’ పరిశోధనలలో తక్కువగా నవ్వే వారిలో కొంతమంది వివిధ వ్యాధులతో మరణిస్తున్నారని తేలిందని, అందుకే రోజుకు ఓసారి తప్పకుండా నవ్వాలని శుక్రవారం ఓ ఆర్డినెన్స్‌ జారీ చేసింది. పని ప్రదేశంలో నవ్వుతో కూడిన వాతావరణాన్ని ప్రోత్సహించాలంటూ కంపెనీలను ఆదేశించింది. ప్రతినెలా ఎనిమిదో తేదీని ప్రత్యేకంగా ‘హాస్యంతో ఆరోగ్యం’ కోసం కేటాయించాలని సూచించింది.

భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం..
నవ్వడం, నవ్వకపోవడమనేది పౌరులకు ఉన్న భావప్రకటనా స్వేచ్ఛలో భాగమని జపాన్ కమ్యూనిస్టు పార్టీ గుర్తుచేసింది. వ్యక్తిగత కారణాల వల్ల కొంతమంది నవ్వలేకపోవచ్చని, తాజా చట్టం ఇలాంటి వారిపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని ఆరోపించింది. ప్రజల హక్కులను కాలరాయొద్దని మండిపడింది. అయితే, ఈ ఆరోపణలను అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ తోసిపుచ్చింది. తాజా చట్టాన్ని ప్రజలపై బలవంతంగా రుద్దడం లేదని స్పష్టం చేసింది. పాటించాలా వద్దా అనే నిర్ణయం ప్రజలకే వదిలివేశామని, అందుకే జరిమానా లాంటివి ఏవీ చట్టంలో పొందుపరచలేదని గుర్తుచేసింది.

  • Loading...

More Telugu News