Telugudesam: కేంద్రంలో ఏపీ రాయబారులుగా ఎంపీలు.. ఒక్కొక్కరికీ ఒక్కో మంత్రిత్వ శాఖ బాధ్యతలు

TDP Mps to take up responsibilities of representive AP in Center

  • రాష్ట్రానికి సంబంధించిన పనులు చక్కబెట్టుకునేందుకు టీడీపీ కీలక నిర్ణయం
  • రాష్ట్రానికి, కేంద్రానికి మధ్య సమాచార లోపం లేకుండా చూసుకునేందుకు ఏర్పాట్లు
  • ఫైళ్ల క్లియరెన్స్, పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో చొరవ తీసుకోనున్న ఎంపీలు

కేంద్రంలో ఏపీకి చెందిన పనులు వడివడిగా చక్కబెట్టుకునేందుకు టీడీపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీడీపీ ఎంపీలకు ఢిల్లీలో ఏపీకి రాయబారులుగా వ్యవహరించే బాధ్యతలను అప్పజెప్పింది. ఒక్కో ఎంపీకి ఒక్కో ప్రధాన మంత్రిత్వ శాఖను కేటాయించి రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, పథకాలు, నిధులు మంజూరుకు సంబంధించి కీలక బాధ్యతలను అప్పగించే దిశగా కసరత్తు ప్రారంభించింది. ఈ నెల 22న కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యేలోపు ఈ ప్రక్రియ పూర్తి కానుంది.

 కేంద్ర, రాష్ట్ర మంత్రులు, అధికారులతో ప్రతి ఎంపీని అనుసంధానం చేయడం, ఢిల్లీకి, రాష్ట్రానికి మధ్య సమాచార లోపం లేకుండా, వేగంగా ఫైళ్ల క్లియరెన్స్ చేయించడం ఎంపీల ప్రధాన బాధ్యతలుగా భావిస్తున్నారు. టీడీపీ పార్లీమెంటరీ పార్టీ నాయకుడిగా వివిధ కేంద్ర మంత్రుల వద్దకు పార్టీ ఎంపీలను తీసుకు వెళ్లి కీలక సమస్యలపై వినతి పత్రాలు సమర్పించి, వాటిని పరిష్కరించే బాధ్యతలను లావు శ్రీకృష్ణదేవరాయలుకు అప్పగించారు. కేంద్ర కేబినెట్ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు కీలకమైన రాజకీయ వ్యవహారాల కమిటీ, పార్లమెంటరీ వ్యవహారాల కమిటీలో సభ్యుడిగా ఉన్నందున ఆయన తోటి మంత్రులు, అధికారులతో సంబంధాలు పెంచుకుని రాష్ట్రానికి చెందిన ప్రధాన సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది. 

టీడీపీ లోక్‌సభ సభ్యుల్లో మొత్తం 16 మంది అనుభవజ్ఞులు, విద్యాధికులు, వ్యాపారవేత్తలు ఉండటంతో వారంతా చంద్రబాబుకు కొండంత అండగా మారనున్నారు. త్వరలో పార్లమెంటులో వివిధ శాఖలకు చెందిన కమిటీల్లో టీడీపీ ఎంపీలకు సభ్యత్వం లభిస్తుందని, అప్పుడు ఆయా శాఖల మంత్రులు, అధికారులతో వారు సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకోవడం ద్వారా రాష్ట్ర ప్రయోజనాలకు తోడ్పడే అవకాశం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News