Odisha: త్వరలో తెరుచుకోనున్న పూరీ రత్నభాండాగారం.. విషసర్పాలు ఉండొచ్చని అనుమానాలు!
- ఈ నెల 14న రత్నభాండాగారం తెరిచేందుకు ఏర్పాట్లు
- లోపల సర్పాలు ఉండొచ్చనే అనుమానం,
- స్నేక్ హెల్ప్ లైన్ నిపుణుల సమక్షంలో తలుపులు తెరిచే ఛాన్స్
- ఆభరణాల నాణ్యత పరిశీలించేందుకు నిపుణుల సాయం తీసుకోనున్న ప్రభుత్వం
ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర రత్నభాండాగారం తెరవడానికి అక్కడి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ గురువారం పూరీలో విలేకరులతో మాట్లాడారు. జస్టిస్ బిశ్వనాథ్‌రథ్ అధ్యక్షతన ఏర్పాటైన అధ్యయన సంఘం ఈ నెల 14న భాండాగారం తెరవడానికి నిర్ణయించిందని చెప్పారు. దీనికి శ్రీక్షేత్ర పాలకవర్గం ఆమోదించినందున, ప్రభుత్వం ఇతర ఏర్పాట్లు చేయనుందన్నారు. అధ్యయన సంఘం జారీ చేసిన మార్గదర్శకాలు పరిశీలిస్తున్నామని, దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తామన్నారు.
అయితే, 14న రత్నభాండాగారం తెరవడానికి ఎంత మంది వెళతారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. భాండాగారం లోపల చీకటిగా ఉంటుంది. దీంతో అక్కడ విషసర్పాలు ఉండొచ్చన్న అనుమానాలు ఉన్నాయి. ఈ క్రమంలో సెర్చ్‌లైట్లు, స్నేక్ హెల్ప్‌లైన్ నిపుణులు, అత్యవసర వైద్యానికి డాక్టర్లు లోపలికి వెళ్లే అవకాశం ఉంది. భాండాగారానికి వెంటనే మరమ్మతులు చేయడానికి పురావస్తు శాఖ సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో స్వామి సంపద శ్రీ క్షేత్రం లోపల మరోచోట భద్రపరిచి లెక్కింపు చేసే అవకాశం ఉంది. ఆభరణాల బరువు తూకం, వాటి నాణ్యత పరిశీలించడానికి ప్రభుత్వం కొంత మంది నిపుణుల్ని నియమిస్తున్నట్టు సమాచారం.