Payyavula Keshav: మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పయ్యావుల.. తొలి సంతకం దేనిపై చేశారంటే..!

Payyavula Keshav takes charge as minister

  • సెక్రటేరియట్ రెండో బ్లాక్ లోని ఛాంబర్ లో బాధ్యతల స్వీకరణ
  • రూ. 250 కోట్లను స్థానిక సంస్థలకు విడుదల చేస్తూ తొలి సంతకం
  • ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే తన ప్రధాన బాధ్యత అన్న పయ్యావుల

ఏపీ ఆర్థిక, ప్రణాళిక, శాసనసభ వ్యవహారాల మంత్రిగా పయ్యావుల కేశవ్ ఈరోజు బాధ్యతలను స్వీకరించారు. సెక్రటేరియట్ లోని రెండో బ్లాక్ లో ఉన్న తన ఛాంబర్ లోకి ప్రవేశించి, వేద పండితుల ఆశీర్వచనాల మధ్య బాధ్యతలు చేపట్టారు. ఆర్థిక మంత్రిగా తన తొలి సంతకాన్ని 15వ ఆర్థిక సంఘం నిధుల ఫైల్ పై చేశారు. రూ. 250 కోట్ల ఆర్థిక సంఘం నిధులను స్థానిక సంస్థలకు విడుదల చేశారు. 

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శులు కేవీవీ సత్యనారాయణ, జానకి, వినయ్ చంద్, స్టేట్ ట్యాక్సెస్ చీఫ్ కమిషనర్ గిరిజా శంకర్, ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీ కె.ఆదినారాయణ, ట్రెజరీస్ డైరెక్టర్ మోహన్ రావుతో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన సందర్భంగా పయ్యావుల మాట్లాడుతూ... రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం తన ప్రధాన బాధ్యత అని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ అసమర్థత కారణంగా 16 పథకాలను కేంద్ర ప్రభుత్వం ఆపేసిందని... ఆ పథకాలన్నీ 60 శాతం రాష్ట్రం, 40 శాతం కేంద్ర ప్రభుత్వం నిధులు పెట్టేవని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిధులను కూడా వాడుకోలేని దారుణ స్థితి వైసీపీ హయాంలో ఉందని విమర్శించారు. జగన్ కు ఎవరు సలహాలు ఇచ్చారో కూడా తెలియడం లేదని అన్నారు. వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ గాడి తప్పాయని వ్యాఖ్యానించారు.

More Telugu News