Chandrababu House Attack: టీడీపీ కార్యకర్తల్లో ఒక్కరి తల తీసినా చంద్రబాబు పారిపోతారని అనుచరుల్ని జోగి రమేశ్ రెచ్చగొట్టారు: ప్రత్యక్ష సాక్షి వాంగ్మూలం

YCP leader Jogi Ramesh provoked his workers against Chandrababu says eyewitness

  • 2021లో చంద్రబాబు ఇంటిపై జోగి రమేశ్, ఆయన అనుచరుల దాడి
  • ఐదారు కార్లలో కర్రలతో వచ్చి దాడికి దిగారన్న తమ్మ శంకర్‌రెడ్డి
  • వారించిన తమపైనా దాడి చేశారని వెల్లడి
  • నిన్న డీఎస్పీ ఎదుట వాంగ్మూలం

చంద్రబాబునాయుడు ఇంటిపై వైసీపీ నేతల దాడికి సంబంధించిన కేసులో ప్రత్యక్ష సాక్షి తమ్మా శంకర్‌రెడ్డి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంతో వైసీపీ నేత జోగి రమేశ్ మెడచుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. వైసీపీ హయాంలో 17 సెప్టెంబర్ 2021లో ఎమ్మెల్యే జోగి రమేశ్ తన అనుచరులతో కలిసి చంద్రబాబునాయుడి ఇంటిపై దాడి చేశారు. అప్పట్లో ఈ కేసు ముందుకు సాగలేదు సరికదా, బాధితులపైనే పోలీసులు కేసులు పెట్టారు. తాజాగా, ఈ కేసులో కదలిక వచ్చింది. దర్యాప్తు వేగం పుంజుకుంది. 

నాటి ఘటనలో ప్రత్యక్ష సాక్షి అయిన ఉండవల్లికి చెందిన తమ్మా శంకర్‌రెడ్డి నిన్న పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. చంద్రబాబు ఇంటి వద్దనున్న టీడీపీ కార్యకర్తల్లో ఒక్కరి తల తీస్తే చాలని, చంద్రబాబు భయపడి ఇల్లు వదిలి పారిపోతారని జోగి రమేశ్ తన అనుచరులను ఉసిగొల్పినట్టు ఆయన తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. అనంతరం ఆయన ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ ఆ రోజు ఏం జరిగిందీ గుర్తుచేసుకున్నారు.

చంద్రబాబును కలిసేందుకు ఉండవల్లి నుంచి స్నేహితులతో కలిసి వెళ్లానని, ఉదయం 11.30 గంటల సమయంలో ఐదారు కార్లలో జోగి రమేశ్, ఆయన అనుచరులు వచ్చారని, కర్రలతో వస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. గొడవ జరుగుతుండడంతో వెళ్లిన తమను కూడా కొట్టారని పేర్కొన్నారు. ‘చంద్రబాబును తరిమేద్దాం. వీళ్లలో ఒక్కడిదైనా తల తీసి చంపేస్తే అప్పుడు చంద్రబాబు ఇల్లు వదిలి పారిపోతారు. ఇక ఆంధ్రాకు తిరిగిరారు’ అని జోగి రమేశ్ హెచ్చరించారని వివరించారు. 

గద్దె రామ్మోహన్, బుద్దా వెంకన్న, తాను, తన స్నేహితులు కలిసి జోగి రమేశ్‌ను వారించామని, ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలని చెప్పినందుకు కర్రలతో తమ తలలపై కొట్టారని గుర్తుచేసుకున్నారు. డీఎస్పీ పిలిస్తే వచ్చి వాంగ్మూలం ఇచ్చినట్టు శంకర్‌రెడ్డి వివరించారు.

  • Loading...

More Telugu News