Allahabad High Court: మత స్వేచ్ఛ హక్కును మత మార్పిళ్లకు అన్వయించరాదు: అలహాబాద్ హైకోర్టు

Allahabad High Court has observed that right to religion cannot be extended to construe a collective right to proselytise

  • మతం మారాల్సిన వ్యక్తికి కూడా మత స్వేచ్ఛ హక్కు సమానంగా వర్తిస్తుందని వ్యాఖ్య
  • మత స్వేచ్ఛ హక్కు కింద ప్రతి వ్యక్తి మత ప్రచారం చేసుకునే హక్కు ఉందని స్పష్టీకరణ
  • మతమార్పిడికి ప్రయత్నించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి బెయిల్ నిరాకరణ

మత మార్పిళ్లపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ ‘మత స్వేచ్ఛ హక్కు’పై అలహాబాద్ హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ హక్కు కింద దేశ పౌరులు తమ మతాన్ని స్వేచ్ఛగా ఆచరించడంతో పాటు ప్రచారం చేసుకోవచ్చునని, అయితే మత మార్పిడికి ఈ చట్టాన్ని అన్వయించకూడదని స్పష్టం చేసింది. ఒక మతం వారిని వేరొక మతంలోకి మార్చేందుకు వెసులుబాటు కల్పించే సామూహిక హక్కుగా భావించరాదని వ్యాఖ్యానించింది. చట్టవిరుద్ధంగా మత మార్పిడికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తికి బెయిల్ నిరాకరిస్తూ అలహాబాద్ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ హక్కు కింద ప్రతి వ్యక్తికి అంతరాత్మ స్వేచ్ఛ ఉంటుందని, ప్రతి వ్యక్తికి మత విశ్వాసాలను ఎంచుకునే, ఆచరించే, వ్యక్తీకరించే హక్కు ఉంటుందని పేర్కొంది. అయితే మతం మారాల్సిన వ్యక్తికి కూడా మత స్వేచ్ఛ హక్కు సమానంగా ఉంటుందనే విషయాన్ని గుర్తించాలని స్పష్టం చేసింది. బలవంతంగా, మోసపూరితంగా మత మార్పిళ్లు చేయడం చట్ట విరుద్ధమని జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ వ్యాఖ్యానించారు.

ఉత్తరప్రదేశ్‌లోని మహరాజ్‌గంజ్‌కు చెందిన విశ్వనాథ్ అనే వ్యక్తి తనను బలవంతంగా మతం మార్చేందుకు ప్రయత్నించాడంటూ శ్రీనివాస రావు నాయక్ అనే వ్యక్తితో పాటు పలువురిపై ఫిర్యాదు చేశాడు. దీంతో ఉత్తరప్రదేశ్ చట్టవిరుద్ధ మత మార్పిడి నిషేధ చట్టం- 2021లోని సెక్షన్లు 3, 5 (1) కింద అతడిపై కేసు నమోదయింది. ఈ కేసులో బెయిల్ కావాలంటూ శ్రీనివాస్ రావు పిటిషన్ దాఖలు చేసుకోగా కోర్టు తిరస్కరించింది. 

ఫిబ్రవరి 15, 2024న నమోదయిన ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాల విషయానికి వస్తే.. షెడ్యూల్డ్ కులాల వర్గానికి చెందిన చాలా మంది గ్రామస్తులు తన ఇంటికి వచ్చి మతం మారాలని కోరారని విశ్వనాథ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ సమయంలో నిందిత వ్యక్తులు శ్రీనివాస్, రవీంద్ర కూడా అక్కడే ఉన్నారని పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నాడు. 

బాధలు తగ్గిపోతాయని, జీవితం మెరుగుపడుతుందని తనను నమ్మించే ప్రయత్నం చేశారని, కొంతమంది గ్రామస్తులు క్రైస్తవ మతంలోకి మారిపోయారని, తాను తప్పించుకొని వచ్చి ఫిర్యాదు చేస్తున్నానని విశ్వనాథ్ పేర్కొన్నాడు. కాగా నిందితుడు శ్రీనివాస్‌కు మత మార్పిడితో ఎలాంటి సంబంధం లేదని, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అతడు బతుకుదెరువు కోసం ఇక్కడికి వచ్చాడని, ఈ కేసులో తప్పుగా అతడిని ఇరికించారని శ్రీనివాస్ తరఫు న్యాయవాది వాదించారు. అయినప్పటికీ బెయిల్ తిరస్కరణకు గురైంది.

  • Loading...

More Telugu News