Flight tyre blows off: టేకాఫ్ సమయంలో పేలిన విమానం టైరు.. వీడియో ఇదిగో

American Airlines plane tyre blows on runway pilot aborts flight

  • ఫ్లోరిడాలోని టాంపా విమానాశ్రయంలో బుధవారం ప్రమాదం
  • టేకాఫ్‌కు సిద్ధమవుతుండగా పేలిన టైరు, ఎగసిన పొగ, నిప్పురవ్వలు
  • వెంటనే టేకాఫ్ ప్రయత్నాన్ని విరమించిన పైలట్
  • విమానంలోని 174 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది సురక్షితం
  • మరో విమానంలో వారిని గమ్యస్థానాలకు తరలింపు

టేకాఫ్ చేసేందుకు రన్‌వేపైకి వస్తుండగా ఓ విమానం టైరు అకస్మాత్తుగా పేలిపోయింది. అమెరికాలోని ఫ్లోరిడాలో నిన్న ఈ ఘటన వెలుగు చూసింది. ఫినిక్స్ నగరానికి వెళ్లే అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ 590 విమానం బుధవారం ఉదయం 8 గంటలకు ఫ్లోరిడాలోని టాంపా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు స్థానిక మీడియా పేర్కొంది. ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. 

టేకాఫ్‌ కోసం టాక్సీ వే మీద నుంచి రన్‌‌వే మీదకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. టైరు పేలడంతో విమానం చక్రాల్లోంచి ఒక్కసారిగా నిప్పురవ్వలు, పొగలు విరజిమ్మాయి. కొన్ని క్షణాల తరువాత విషయన్ని గుర్తించిన పైలట్ వెంటనే టేకాఫ్ ప్రయత్నాన్ని విరమించాడు. ఘటన సమయంలో విమానంలో 174 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. అయితే, వారెవరికీ ఎటువంటి ఇబ్బందీ కలగలేదని, విమానాశ్రయ కార్యకలాపాలకు ఎటువంటి అంతరాయం ఏర్పడలేదని అమెరికా పౌర విమానయాన విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులను మరో విమానంలో వారి గమ్యస్థానాలకు చేర్చినట్టు పేర్కొంది. కాగా, ఒకటికి మించి విమానం టైర్లు పేలినట్టు అనుమానాలు వ్యక్తం కావడంతో ఘటనపై దర్యాప్తు చేస్తామని వెల్లడించింది. 

  • Loading...

More Telugu News