Shivani Raja: బ్రిటన్‌ ఎన్నికల్లో భారత సంతతి మహిళా వ్యాపారవేత్త గెలుపు.. భగవద్గీతపై ప్రమాణం

Indian origin UK MP Shivani Raja takes oath on Bhagavad Gita after historic victory

  • లీసెస్టర్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి కన్జర్వేటివ్ పార్టీ తరపున గెలిచిన శివానీ రాజా
  • నియోజకవర్గంలో 37 ఏళ్ల తరువాత లేబర్ పార్టీ ఆధిపత్యానికి ముగింపు
  • భగవద్గీతపై ప్రమాణం చేసి ఎంపీ బాధ్యతలు చేపట్టడం తానెన్నడూ మర్చిపోలేనని శివానీ వ్యాఖ్య

ఇటీవల జరిగిన బ్రిటన్ ఎన్నికల్లో భారత సంతతి మహిళా వ్యాపారవేత్త, కన్జర్వేటివ్ పార్టీ నేత శివానీ రాజా చరిత్ర సృష్టించారు. 

లీసెస్టర్ ఈస్ట్ సీటు నుండి ఎన్నికల బరిలో దిగిన ఆమె ప్రతిపక్ష లేబర్ పార్టీకి చెందిన రాజేశ్ అగర్వాల్‌పై గొప్ప మెజారిటీతో గెలుపొంది బ్రిటన్ దిగువ సభలో కాలుపెట్టారు. ఈమె విజయంతో దాదాపు  37 ఏళ్ల తరువాత ఆ నియోజకవర్గంలో కన్జర్వేటివ్ పార్టీ గెలుపొందింది.

దిగువ సభలో జరిగిన కార్యక్రమంలో శివానీ భగవద్గీతపై ప్రమాణం చేసి తన ఎంపీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం, ఆమె ఎక్స్ వేదిగా తన సంతోషాన్ని పంచుకున్నారు. భగవద్గీత సాక్షిగా  బ్రిటన్ రాజు విశ్వసనీయురాలిగా ఉంటానంటూ ప్రమాణం చేయడం తన జీవితంలో మరిచిపోలేని రోజని ఆమె వ్యాఖ్యానించారు. 

కాగా, ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి రాజేశ్ అగర్వాల్‌కు 10,100 ఓట్లు రాగా శివానీకి 14526 ఓట్లు పోలయ్యాయి. ఇటీవల టీ20 మ్యాచ్ సందర్భంగా స్థానిక హిందూ, ముస్లిం మతస్తుల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్న నేపథ్యంలో శివానీ ఎన్నికకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. 

కాగా, ఈ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన మొత్తం 27 మంది దిగువ సభకు ఎంపీలుగా ఎన్నికయ్యారు. అంతేకాకుండా, రికార్డు స్థాయిలో 263 మంది మహిళలు ఎంపీలుగా గెలుపొందారు. ఇక సభలో శ్వేతజాతీయేతర ఎంపీల సంఖ్య కూడా మునుపెన్నడూ లేని విధంగా 90కి చేరింది. బ్రిటన్ ప్రధాని బాధ్యతలు చేపట్టిన లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్ దేశాన్ని పునర్నిర్మిస్తానని ప్రతినబూనారు. ఆయన సారథ్యంలోని లేబర్ పార్టీ మొత్తం 650 సీట్లకు గాను 412 సీట్లలో ఘన విజయం సాధించింది. ఇక కన్జర్వేటివ్ పార్టీ ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని మాజీ ప్రధాని రిషి సునాక్ అన్నారు. ప్రజల్లో ఆగ్రహం, అసంతృప్తి గూడుకట్టుకున్నాయని ఆయన అంగీకరించారు.

  • Loading...

More Telugu News