Sunitha williams: మమ్మల్ని భూమికి చేర్చే సామర్థ్యం ఆ వ్యోమనౌకకు ఉంది: భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్

Two NASA astronauts including Indian American Sunita Williams confident Boeings space capsule can return

  • బోయింగ్ స్పేస్ క్యాప్సుల్ స్టార్‌లైనర్ తమను సురక్షితంగా భూమికి చేరుస్తుందన్న ఆస్ట్రోనాట్స్
  • స్టార్‌లైనర్ క్యాప్సుల్‌లో సాంకేతిక లోపాల కారణంగా తిరుగుప్రయాణం పలుమార్లు వాయిదా
  • వ్యోమగాముల తిరుగు ప్రయాణంపై తమకు ఇప్పుడే తొందరేమీ లేదన్న నాసా

బోయింగ్ రూపొందించిన స్పేస్ క్యాప్సుల్ (వ్యోమనౌక) తమను సురక్షితంగా భూమికి చేర్చగలదన్న నమ్మకం తమకుందని అంతరిక్ష కేంద్రంలో ఉన్న భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో ఆస్ట్రోనాట్ బుచ్ విల్మోర్ అన్నారు. బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్ క్యాప్సుల్‌ను పరీక్షించేందుకు సునీతా, బుచ్ అంతరిక్ష యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. నాసాకు చెందిన కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్‌లో భాగంగా ఇరు వ్యోమగాములు స్టార్‌లైనర్లో స్పేస్ స్టేషన్‌కు వెళ్లారు. 

రెండు వారాల క్రితమే వారు భూమికి తిరిగి రావాల్సి ఉండగా పలు సాంకేతిక సమస్యల కారణంగా ప్రయాణం వాయిదా పడుతూ వస్తోంది. కాగా, వారు ఎప్పుడు తిరిగిరావాలన్న దానిపై తాము ఎటువంటి తేదీ నిర్ణయించలేదని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కొన్ని రోజుల క్రితం ప్రకటించింది. వారి తిరుగు ప్రయాణంపై తొందరేమీ లేదని స్పష్టం చేసింది. 

జూన్ 5న సునీతా, బుచ్ అంతరిక్ష యాత్రను ప్రారంభించారు. ఐఎస్ఎస్ చేరుకునే క్రమంలో స్టార్‌లైనర్ నుంచి హీలియం వాయువు లీకవడాన్ని గుర్తించారు. క్యాప్సుల్ దిశను మార్చే థ్రస్టర్లలో హీలియంను వినియోగిస్తారు. అయితే, వ్యోమగాములు తిరిగొచ్చేందుకు ఈ సమస్య అడ్డంకి కాబోదని నాసా తెలిపింది. కానీ, ఈ సమస్యపై మరింత సమాచారం సేకరించాకే తాము వ్యోమగాములను తిరిగి భూమికి చేరుస్తామని నాసా పేర్కొంది. ఇక సునీతా, బుచ్ ప్రస్తుతం ఐఎస్ఎస్‌కు అనుసంధానమై ఉన్న క్యాప్సుల్‌లోని సర్వీస్ మాడ్యుల్‌లో ఉన్నారు.

  • Loading...

More Telugu News