USA: ఇండియా తలుచుకుంటే రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలదు: అమెరికా

US Says India Has Ability To Urge Putin To End War In Ukraine

  • మోదీ రష్యా పర్యటనపై శ్వేతసౌధం స్పందన
  • పుతిన్‌కు చెప్పి యుద్ధం ఆపించగల సామర్థ్యం ఇండియాకు ఉందని వ్యాఖ్య
  • రష్యాతో భారత్‌కు ఉన్న దగ్గరి సంబంధాలే ఇందుకు కారణమని వెల్లడి

రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలిగే శక్తి భారత్‌కు ఉందని అమెరికా శ్వేతసౌధం ప్రతినిధి జాన్ పియర్ అభిప్రాయపడ్డారు. రష్యాతో భారత్‌కు ఉన్న దౌత్యసంబంధాలే ఇందుకు కారణమన్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై స్పందించిన మోదీ అమాయక చిన్నారులు ఈ యుద్ధంలో బలవడం భయానకమని, వేదన కలిగిస్తోందని రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో అన్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ లోని ఆసుపత్రిపై దాడి జరిగిన అనంతరం ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన శ్వేత సౌధం ప్రతినిధి భారత్ తలుచుకుంటే యుద్ధం ఆపగలదని వ్యాఖ్యానించారు. 

కాగా, ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే తన రెండు రోజుల రష్యా పర్యటన ముగించుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశమయ్యారు. ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలయ్యాక ఇరు దేశాధినేతలు సమావేశం అవడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ప్రధాని మోదీని పుతిన్ తమ దేశ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించారు. కాగా. మోదీ అధికారం చేపట్టినప్పటి నుంచీ ఇప్పటివరకూ పుతిన్‌ను 16 సార్లు కలిశారు. ఇక పుతిన్ చివరిసారిగా భారత్‌ను 2021 డిసెంబర్‌లో సందర్శించారు. 

ఇదిలా ఉంటే మోదీ రష్యా పర్యటన తమను నిరాశపరిచిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. పర్యటన సందర్భంగా మోదీ పుతిన్‌‌ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశ నాయకుడు ఓ యుద్ధ నేరగాణ్ణి ఆప్యాయంగా కౌగిలించుకోవడం శాంతి ప్రయత్నాలకు గొడ్డలి పెట్టు వంటిదని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News