NEET: నీట్ పరీక్షలో మాల్‌ప్రాక్టీస్ పెద్దగా జరగలేదు.. రీటెస్ట్ నిర్వహించబోం: సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్

Centre submitted an affidavit in the court stating that  there was no large scale malpractice in NEET

  • విద్యార్థుల సమూహం ఎక్కువ స్కోరు పొందారనడానికి ఆధారాలు లభించలేదని వెల్లడి
  • నిరాధార ఆరోపణల ఆధారంగా తిరిగి పరీక్ష పెడితే 24 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం పడుతుందని వ్యాఖ్య
  • జులై 3వ వారం నుంచి నీట్-యూజీ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు ప్రకటన

నీట్‌-యూజీలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన 40కిపైగా పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ(గురువారం) విచారణ చేపట్టనున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. నీట్ పరీక్షలో మాల్ ప్రాక్టీస్ భారీ ఎత్తున జరగలేదని, ఏదైనా ఒక ప్రాంతానికి చెందిన అభ్యర్థుల సమూహం అనుమానాస్పద రీతిలో ఎక్కువ స్కోరు పొందారనడానికి కూడా ఎలాంటి ఆధారాలు లభించలేదంటూ సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. నీట్ ఫలితాలను సమగ్రంగా విశ్లేషించామని, మళ్లీ పరీక్ష నిర్వహించే ఉద్దేశం లేదని కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది. నిరాధారమైన అనుమానాలతో తిరిగి పరీక్ష పెడితే మే 5న పరీక్షకు హాజరైన దాదాపు 24 లక్షల మంది విద్యార్థులపై భారం పడుతుందని పేర్కొంది.

నీట్-యూజీ కౌన్సెలింగ్ ప్రక్రియను జులై మూడవ వారం నుంచి మొదలుపెట్టనున్నట్టు అఫిడవిట్‌లో పేర్కొంది. మొత్తం నాలుగు దశల్లో కౌన్సెలింగ్ చేపట్టనున్నట్టు తెలిపింది. ఎవరైనా అభ్యర్థి అవకతవకలకు పాల్పడినట్లు తేలితే వారి కౌన్సెలింగ్ రద్దు చేయనున్నామని, కౌన్సెలింగ్ దశలలో లేదా ఆ తర్వాతైనా రద్దు చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది.

సిలబస్ తగ్గింపు కారణంగా మార్కులు పెరిగాయి
ఐఐటీ మద్రాస్ నిపుణులు నీట్-యుజీ-2024కు సంబంధించిన డేటాను సాంకేతికంగా విశ్లేషించారని, సామూహిక మాల్‌ప్రాక్టీస్ లేదా స్థానిక అభ్యర్థుల సమూహానికి ప్రయోజనం చేకూరినట్టు సూచనలు కనిపించలేదని అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొంది. మాల్ ప్రాక్టీస్ జరిగితే అసాధారణ స్కోర్‌లు వస్తాయని, కానీ అలాంటి ఆధారాలు లభించలేదని వివరించింది. విద్యార్థులు పొందిన మార్కులను గమనిస్తే 550 నుంచి 720 వరకు పెరుగుదల ఉందని, అయితే ఈ పెరుగుదల అన్ని నగరాలు, పరీక్ష కేంద్రాలలోనూ కనిపించిందని పేర్కొంది. సిలబస్‌లో 25 శాతం తగ్గింపు కారణంగా ఈ ట్రెండ్ కనిపించిందని అభిప్రాయపడింది. ఎక్కువ స్కోరు సాధించినవారు సామూహిక అవకతవకలకు పాల్పడేందుకు చాలా తక్కువ అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నట్టు కేంద్రం వివరించింది.

కాగా పేపర్ లీకేజీ ఆరోపణల నేపథ్యంలో మెడికల్ ప్రవేశ పరీక్షను మళ్లీ నిర్వహించాలని కొందరు పిటిషన్ వేయగా.. మళ్లీ పరీక్ష నిర్వహించొద్దంటూ మరి కొందరు పిటిషన్ వేయడం గమనార్హం.

  • Loading...

More Telugu News