Pawan Kalyan: పర్యాటకులను ఆకట్టుకునే అరుదైన జంతువులను దిగుమతి చేసుకోవాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Pawan Kalyan reviews on Zoo Parks in state

  • పవన్ నివాసంలో జూ పార్క్ అథారిటీ సమావేశం
  • అంతర్జాతీయ ప్రమాణాలతో జూ పార్కులు అభివృద్ధి చేయాలన్న పవన్
  • పర్యాటకులను ఆకర్షించేలా ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని సూచన

రాష్ట్రంలో జంతు ప్రదర్శనశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, రాష్ట్ర అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం, తిరుపతిల్లో ఉన్న జూ పార్కులకు ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. రాష్ట్రంలో నూతన జంతు ప్రదర్శనశాలల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని చెప్పారు. 

మంగళగిరిలోని పవన్ కల్యాణ్ నివాసంలో జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నింగ్ బాడీ 14వ సమావేశం జరిగింది. సమావేశంలో రాష్ట్రంలో ఉన్న జూ పార్కుల నిర్వహణ, ఆదాయ వ్యయాల వివరాలను పవన్ కల్యాణ్ కి అధికారులు వివరించారు. 

జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవ ఛైర్మన్ హోదాలో రాష్ట్రంలో జూ పార్కులు, పర్యావరణహిత పర్యాటక రంగ అభివృద్ధి తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ... అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో జూ పార్కులను అభివృద్ధి చేయాలని, పర్యావరణహిత కార్యక్రమాలతో పర్యాటకులను మరింత ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని సూచించారు. 

జూ పార్కుల అభివృద్ధికి పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో నిధులు సమకూర్చడం, అరుదైన, ఆకర్షణీయంగా ఉండే జంతువులను దిగుమతి చేసుకోవడం వంటి అంశాల మీద దృష్టి సారించాలని ఆదేశించారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా వన్యప్రాణుల సందర్శనతో చక్కటి అనుభూతులు (వైల్డ్ లైఫ్ ఎక్స్ పీరియన్స్) కలిగేలా ఏర్పాట్లు చేయాలన్నారు. 

జూ పార్కుల అభివృద్ధిలో కార్పోరేట్లను భాగస్వాముల్ని చేయాలని, పరిశ్రమల సీఎస్ఆర్ నిధులతో జూ పార్కులకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పారిశ్రామికవేత్తలు వ్యక్తిగతంగా జంతువులను దత్తత తీసుకోవడం, అభివృద్ధికి దాతల సహకారం తీసుకోవడం వంటి కార్యచరణలు రూపొందించాలని సూచించారు.

ఈ కార్యక్రమాన్ని ప్రమోట్ చేసేందుకు తిరుపతి, విశాఖ పర్యటనల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. అవసరమైతే పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులను జంతు ప్రదర్శనశాలల అభివృద్ధిలో పాలుపంచుకొనేలా చేసేందుకు ఉపముఖ్యమంత్రితో 'తేనీటి సేవనం' (టీ విత్ డిప్యూటీ సీఎం) అనే కార్యక్రమాన్ని రూపొందించాలని చెప్పారు.

  • Loading...

More Telugu News