Gold: భారత్-చైనా సరిహద్దుల్లో 108 కిలోల బంగారం స్వాధీనం
- తూర్పు లడఖ్ లో చాంగ్ తాంగ్ సబ్ సెక్టార్ లో ఘటన
- పక్కా సమాచారంతో స్మగ్లర్ల ఆటకట్టించిన ఐటీబీపీ బలగాలు
- ఐటీబీపీ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో తొలిసారిగా బంగారం స్వాధీనం
భారత్-చైనా సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న ఐటీబీపీ (ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్) బలగాలు భారీ ఎత్తున బంగారం స్వాధీనం చేసుకున్నాయి. ఔషధ మొక్కల డీలర్ల ముసుగులో 108 కిలోల బంగారం అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తులను భారత భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.
ఐటీబీపీ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో బంగారం స్వాధీనం చేసుకోవడం ఇదే ప్రథమం. తూర్పు లడఖ్ లోని చాంగ్ తాంగ్ సబ్ సెక్టార్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.
డిప్యూటీ కమాండెంట్ దీపక్ భట్ నాయకత్వంలోని పెట్రోలింగ్ స్క్వాడ్ పక్కా సమాచారంతో స్మగ్లర్లను పట్టుకుంది. వారి నుంచి బిస్కెట్ల రూపంలో ఉన్న బంగారంతో పాటు రెండు ఫోన్లు, ఒక బైనాక్యులర్, రెండు కత్తులు, కొన్ని రకాల చైనీస్ ఆహార పదార్థాలు, కేక్ లు, పాలు స్వాధీనం చేసుకున్నారు. ఐటీబీపీ బలగాలను చూసి స్మగ్లర్లు పారిపోయే ప్రయత్నం చేయగా, వెంటాడి పట్టుకున్నారు.