Supreme Court: విడాకుల తర్వాత ముస్లిం మహిళలు భర్త నుంచి భరణం కోరవచ్చు: సుప్రీంకోర్టు

Supreme Court confirms Muslim women can seek maintenance after divorce

  • హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి కేసులో సుప్రీం తీర్పు
  • వివాహిత భరణం కోరడంలో తప్పులేదన్న అత్యున్నత న్యాయస్థానం
  • అందుకు మతంతో సంబంధం లేదని స్పష్టీకరణ 

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ కేసులో కీలకమైన తీర్పు వెలువరించింది. సీఆర్పీసీ సెక్షన్ 125 ప్రకారం... మతంతో సంబంధం లేకుండా ఏ వివాహిత అయినా విడాకులు తీసుకున్నప్పుడు భర్త నుంచి భరణం కోరే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. ముస్లిం మతానికి చెందిన మహిళ అయినా, భర్త నుంచి విడాకుల తర్వాత భరణం కోరవచ్చని వివరించింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. 

తన మాజీ భార్యకు రూ.10 వేల మధ్యంతర భరణం చెల్లించాలన్న తెలంగాణ హైకోర్టు ఆదేశాలను ఓ ముస్లిం వ్యక్తి సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. 

విడాకులు తీసుకున్న ముస్లిం మహిళకు సీఆర్పీసీ సెక్షన్ 125 కింద దక్కే ప్రయోజనాలు ముస్లిం మహిళల చట్టం 1986 ప్రకారం చెల్లుబాటు కావని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే ఈ వాదనలను ద్విసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది. 

ఓ మహిళకు భరణం ఇవ్వడం అనేది దానధర్మం వంటిది కాదని, భరణం అనేది వివాహిత మహిళ ప్రాథమిక హక్కు అని స్పష్టం చేసింది. ఇది మతపరమైన హద్దులకు అతీతమైనదని, ప్రతి వివాహిత మహిళకు ఆర్థిక భద్రత కలిగించాలన్న సూత్రం ఇందులో ఇమిడి ఉందని తెలిపింది. అంతేకాదు, సీఆర్పీసీ సెక్షన్ 125 కేవలం వివాహిత మహిళలకే కాకుండా అందరు మహిళలకు వర్తిస్తుందని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు.

గృహిణులు వారి కుటుంబాల కోసం చేసే త్యాగాలను పురుషులు ఇప్పటికైనా గుర్తించాల్సిన సమయం వచ్చిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. భార్యతో కలిసి జాయింట్ బ్యాంక్ అకౌంట్ ఏర్పాటు చేసుకోవడం, భార్యతో ఏటీఎం కార్డు వివరాలు పంచుకోవడం ద్వారా తన కుటుంబంలో ఆర్థిక స్థిరత్వం కోసం పురుషుడు ముందుకు రావాలని అత్యున్నత న్యాయస్థానం పిలుపునిచ్చింది.

  • Loading...

More Telugu News