Amaravati Autodriver: అనర్గళంగా ఇంగ్లిష్​ లో మాట్లాడుతూ అదరగొడుతున్న ఆటో డ్రైవర్.. ఇదిగో వీడియో

Autodriver speaking fluent English in Amaravati video goes viral

  • ఇంగ్లిష్ తో ఆకట్టుకుంటున్న మహారాష్ట్రలోని అమరావతి ఆటో డ్రైవర్
  • ప్రపంచంలో ఎక్కడ బతకాలన్నా ఇంగ్లిష్ ను తప్పనిసరిగా నేర్చుకోవాలని సూచన
  • ఇంగ్లిష్ అంతర్జాతీయ భాష అంటూ కామెంట్
  • నెట్టింట వీడియో వైరల్.. 30 లక్షలకుపైగా వ్యూస్  

మహారాష్ట్రలోని అమరావతిలో ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్న ఓ పెద్దాయన తన ఇంగ్లిష్ వాగ్ధాటితో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఎక్కడా తడుముకోకుండా అనర్గళంగా మాట్లాడుతూ అదరగొడుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ యువకుడు సోషల్ మీడియాతో పంచుకోవడంతో అదికాస్తా వైరల్ గా మారింది. ఆ వీడియోకు ఏకంగా 30 లక్షలకుపైగా వ్యూస్ లభించాయి.

ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలో ఎక్కడ బతకాలన్నా ఇంగ్లిష్ రావడం తప్పనిసరి అని చెప్పాడు. ‘మీరు లండన్, పారిస్, అమెరికా, టోక్యో లాంటి ప్రాంతాలకు వెళ్లాలంటే ఇంగ్లిష్ రావాల్సిందే. లేకపోతే మీరు అక్కడకు వెళ్లలేరు. ఉదాహరణకు మీరు లండన్ లో ఏదైనా హోటల్ కు వెళ్లి ఓ గ్లాస్ మంచినీళ్లు కావాలని ఇంగ్లిష్ లో అడిగితే టక్కున తెచ్చిస్తారు. అదే మీరు మరాఠీలో అడిగితే ఈ హోటల్ లో మీకు ప్రవేశం లేదు.. గెటవుట్ అంటారు’ అంటూ ఇంగ్లిష్ లో ఆ ఆటోడ్రైవర్ చెప్పుకొచ్చాడు. అందుకే ప్రతి ఒక్కరూ ఆంగ్లం నేర్చుకుని మాట్లాడాలని సూచించాడు. ఇంగ్లిష్ ను అంతర్జాతీయ భాషగా అభివర్ణించాడు.

తన ఆటోలో పరిచయం లేని ఇద్దరు ప్రయాణికులను షేరింగ్ పద్ధతిలో ఆ పెద్దాయన తీసుకెళ్తున్నట్లు వీడియోలో కనిపించింది. తన గమ్యస్థానం చేరుకోగానే ఓ వ్యక్తి ఆటోలోంచి దిగి ఆయనతో సంభాషణ సాగిస్తూ ఈ వీడియో తీశాడు. అనంతరం ఆ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు.

‘నేను ఇవాళ ఓ ఆటో డ్రైవర్ గా పనిచేసే పెద్దాయన్ను కలిసి ఆశ్చర్యపోయా. ఎందుకంటే.. ఆయన అనర్గళంగా ఇంగ్లిష్ లో మాట్లాడుతున్నారు. ఆయనతో మాట్లాడేటప్పుడు నేనే కాస్త తడబడ్డాను. మామధ్య సరదా సంభాషణ సాగింది. అయితే అందరినీ ఇంగ్లిష్ లో మాట్లాడాలని ఆయన చైతన్యవంతులను చేయడం ఆశ్చర్యం కలిగించింది’ అని ఆ వీడియో కింద క్యాప్షన్ ను జత చేశాడు.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆ పెద్దాయన అవలీలగా ఇంగ్లిష్ మాట్లాడటం చూసి ఫిదా అవుతున్నారు. ‘వావ్.. అద్భుతం’ అని ఓ యూజర్ కామెంట్ చేయగా మరొకరేమో ‘ఆయన మాటతీరు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం లాగా ఉంది’ అని అభిప్రాయపడ్డాడు. ఇంకొందరేమో ‘మీరు మా మనసులు గెలుచుకున్నారు చాచా’ అని కామెంట్స్ పోస్ట్ చేశారు.

View this post on Instagram

A post shared by BHUSHAN (@kon_bhushan1222)

  • Loading...

More Telugu News