Anna canteens: అన్న క్యాంటీన్ల పునః ప్రారంభానికి ముహూర్తం ఖరారు!

Anna canteens likely restart from August 15

  • ఆగస్టు 15 నుంచి ప్రారంభించే విషయాన్ని పరిశీలిస్తున్న ప్రభుత్వం
  • టెండర్లు పిలిచి పనుల ప్రారంభించాలంటూ ప్రభుత్వం ఆదేశాలు
  • తొలి దశలో 183 క్యాంటీన్ల ఏర్పాటు 

కేవలం రూ.5 లకే ఆకలిని తీర్చే ‘అన్న క్యాంటీన్లు’ పునః ప్రారంభానికి ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న తొలి దశలో కొన్ని క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ.. సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. తొలి దశలో 183 క్యాంటీన్లు ప్రారంభించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. టెండర్లు పిలిచి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించింది. గతంలో నిర్వహించిన క్యాంటీన్‌ భవనాలను ఆధునికీకరించి, అన్ని సౌకర్యాలతో సిద్ధం చేసే బాధ్యతను పట్టణ స్థానిక సంస్థలకు ప్రభుత్వం అప్పగించినట్టు తెలుస్తోంది.

టెండర్లు ఆహ్వానించిన ప్రభుత్వం 
తొలి దశలో ప్రారంభించే 183 క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేసే సంస్థ కోసం అధికారులు టెండర్లు పిలిచారు. టెండర్లు సమర్పించేందుకు ఈ నెల 22 చివరి తేదీగా ప్రకటించారు. ఈ నెలాఖరు లోగా టెండర్లు ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు క్యాంటీన్ల నిర్వహణకు దాతల నుంచి విరాళాలు సేకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన విరాళాలపై పన్ను మినహాయింపు దక్కే సూచనలు ఉన్నాయి. ఇక అన్న క్యాంటీన్ల పేరుతో ట్రస్ట్‌ ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం ఓ వెబ్‌సైట్‌ను కూడా అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నారు.

కాగా టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన అన్న క్యాంటీన్లు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూతపడిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి తిరిగి అధికారంలోకి రావడంతో క్యాంటీన్లను తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికల ప్రచారంలో కూడా టీడీపీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Anna canteens
Telugudesam
Andhra Pradesh
AP Govt
  • Loading...

More Telugu News