Assault On Woman: విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికురాలిపై లైంగికదాడికి యత్నం.. కిందపడిన బాధితురాలు

Sexual Assault On Woman In Visakha Express Rail Near Miryalaguda

  • మిర్యాలగూడ స్టేషన్ సమీపంలో ఘటన
  • వాష్‌రూము నుంచి వస్తున్న మహిళ నడుము పట్టుకుని లాగిన యువకుడు
  • నిందితుడిని ఒడిశాకు చెందిన బిశ్వాస్‌గా గుర్తింపు
  • బాధితురాలు శ్రీకాకుళం జిల్లాలో ఓ ప్రైవేట్ టీచర్

సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్లే విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణికురాలిపై ఓ యువకుడు లైంగిక దాడికి యత్నించాడు. ఈ క్రమంలో మహిళ రైలు నుంచి కిందపడడంతో గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో మిర్యాలగూడ స్టేషన్‌కు చేరుకుంటున్న సమయంలో రైలు వేగం తగ్గింది.

అదే సమయంలో ఎస్-2 బోగీలో ఉన్న ఓ మహిళ వాష్ రూము నుంచి తన సీటు వద్దకు వెళ్తుండగా మద్యం మత్తులో డోర్ వద్ద ఉన్న యువకుడు ఆమె నడుము పట్టుకుని కిందికి లాగాడు.  దీంతో ఆమె కిందపడిపోయింది. రైలు కొద్దిదూరం వెళ్లిన తర్వాత యువకుడు కూడా కిందపడ్డాడు.    

కిందపడిన మహిళ నడుచుకుంటూ సమీపంలోని తండా వద్దకు వెళ్లి విషయం చెప్పింది. వారు రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో వారొచ్చి అంబులెన్స్‌లో బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. అలాగే, రైల్వే పట్టాలపై పడి ఉన్న నిందితుడిని కూడా గుర్తించి ఆసుపత్రికి తరలించారు. అతడిని ఒడిశాకు చెందిన బిశ్వాస్‌గా గుర్తించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన బాధితురాలు ఓ ప్రైవేట్ టీచర్‌గా పనిచేస్తున్నట్టు తెలిసింది. ఆమె ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News