TDP Worker Killed: అనంతపురంలో టీడీపీ కార్యకర్త హత్య.. పాత కక్షలే కారణం!

TDP worker killed in Anantapur District

  • రాయదుర్గం మండలం మెచ్చరి గ్రామానికి చెందిన ఆదెప్ప మృతి
  • కత్తులతో నరికి చంపిన వైనం
  • గ్రామంలోని దేవాలయం అర్చకత్వం విషయంలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య కొన్నేళ్లుగా ఆధిపత్య పోరు

అనంతపురం జిల్లాలో దారుణ హత్య వెలుగుచూసింది. రాయదుర్గం మండలం మెచ్చరి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ఆదెప్ప(50) హత్యకు గురయ్యారు. ప్రత్యర్థులు కత్తులతో విచక్షణారహితంగా నరికి చంపారు. మృతదేహాన్ని గ్రామ శివారులో పడేశారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దులో ఈ హత్య జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఆదెప్ప మంగళవారం వ్యక్తిగత పనిమీద సరిహద్దునే ఉన్న కర్ణాటకకు వెళ్లారని, సాయంత్రం 6 గంటల సమయంలో ఫోన్‌లో కూడా మాట్లాడారని, అయితే రాత్రి 9 గంటల సమయంలో ఆదెప్ప హత్యకు గురయినట్టు తెలిసిందని బంధువులు వెల్లడించారు.

మొలకాల్మూర్‌ తాలూకా పేదారగుడ్డం వెళ్లే మార్గంలో ఆదెప్ప మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ హత్య వెలుగుచూసింది. రాయదుర్గం పట్టణ సీఐ శ్రీనివాసులు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. ఇంటి నుంచి ఆదెప్ప తీసుకెళ్లిన టూవీలర్‌ను పక్కనే వదిలేసి వెళ్లడంతో కర్ణాటకలో హత్య చేసి ఉంటారని, మృతదేహాన్ని గ్రామ శివారులో పడేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

గ్రామంలో ఆధిపత్య పోరు
మెచ్చరి గ్రామంలో ఆంజనేయస్వామి దేవాలయ అర్చకత్వం విషయం చిచ్చుపెట్టినట్టు తెలుస్తోంది. గత మూడేళ్లుగా రెండు సామాజిక వర్గాల మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది. ఇతరులు గ్రామ దేవాలయంలో పూజలు చేయడాన్ని వైసీపీ నాయకులు అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు గ్రామస్తుల మద్దతుతో కోర్టుకు వెళ్లిన పండితులకు అనుకూలంగా తీర్పు కూడా వచ్చింది. అయితే వైసీపీ నాయకులకు భయపడి మూడేళ్లుగా పూజారులు ఆలయం వైపు వెళ్లలేదు. రెండేళ్లక్రితం కూడా ఈ అంశంలో గ్రామంలో రెండు వర్గాల మధ్య గొడవలు జరిగాయి. ఇరువర్గాలపై కేసులు కూడా నమోదయ్యాయి. గ్రామంలో పికెటింగ్ నిర్వహించడంతో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. అయితే కూటమి అధికారంలోకి రావడంతో ఆలయాన్ని తిరిగి తెరిచారు. ఆలయ పునఃప్రారంభంలో ఆదెప్ప కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో హత్య జరగడం గ్రామంలో సంచలనం సృష్టిస్తోంది.

  • Loading...

More Telugu News