Siddharth: నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు... రేవంత్ రెడ్డి సర్ మేం మీతోనే ఉన్నాం: హీరో సిద్ధార్థ
- మాదక ద్రవ్యాల విషయంలో ప్రభుత్వంతో కలిసి పని చేస్తామని స్పష్టీకరణ
- డ్రగ్స్ మీద పోరాటం చేయాలన్న ప్రభుత్వం నిర్ణయాన్ని సమర్థిస్తున్నామన్న హీరో
- సామాజిక బాధ్యతతో పని చేస్తామని వెల్లడి
డ్రగ్స్ నిర్మూలన కోసం పని చేస్తున్నందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కంగ్రాట్స్ చెబుతున్నానని నటుడు సిద్ధార్థ అన్నారు. 'మేం మీతో ఉన్నాం సర్ (వీ ఆర్ విత్ యు సర్)' అని చెప్పారు. భారతీయుడు-2 ప్రెస్ మీట్ సందర్భంగా డ్రగ్స్‌కు సంబంధించి రేవంత్ రెడ్డి షరతు విధించడంపై సిద్ధార్థ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దీంతో ఆయన వివరణ ఇస్తూ వీడియోను విడుదల చేశారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు.
భారతీయుడు-2 సినిమాలో తాము డ్రగ్స్, అవినీతిపై జీరో టాలరెన్స్ గురించి చెబుతున్నామని... అలాంటి భారతీయుడు-2 సినిమా ప్రెస్ మీట్‌లో ఓ ప్రశ్నకు తాను చెప్పిన సమాధానాన్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. అందుకే తాను స్పష్టతను ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. తన వ్యాఖ్యల ఉద్దేశం వేరు అన్నారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వమూ తమను ఫోర్స్ చేయలేదని మాత్రమే చెప్పానని, తాము స్వతంత్రంగా పని చేశానని చెప్పానన్నారు. మాదకద్రవ్యాల విషయంలో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేస్తామన్నారు.
డ్రగ్స్ మీద పోరాటం చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాన్ని తాను పూర్తిగా సమర్థిస్తున్నానని పేర్కొన్నారు. మన పిల్లల భవిష్యత్తు మన చేతిలో కూడా ఉందన్నారు. వాళ్ల భవిష్యత్తును కాపాడుకోవడం మన కర్తవ్యంగా భావించాలన్నారు. డ్రగ్స్ విషయంలో మనం 100 శాతం తెలంగాణ ప్రభుత్వంతో ఉంటామన్నారు. టాలీవుడ్ కూడా ప్రభుత్వంతో కలిసి పని చేయాలన్నారు. తన కెరీర్ చివరి వరకు సామాజిక బాధ్యతతో పని చేస్తానని పునరుద్ఘాటించారు.