Kakani Govardhan Reddy: చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం నిండా అబద్ధాలే: కాకాణి గోవర్ధన్ రెడ్డి

Kakani Govardhan Reddy slams Chandrababu

  • నేడు విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి  
  • జగన్ ను విమర్శించడానికే అధిక సమయం కేటాయించారన్న కాకాణి 
  • విద్యుత్ రంగాన్ని భ్రష్టుపట్టించిందే చంద్రబాబు అంటూ విమర్శలు

ఏపీ సీఎం చంద్రబాబు నేడు విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేయడం తెలిసిందే. దీనిపై మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు విడుదల చేసిన శ్వేత పత్రం నిండా అబద్ధాలేనని అన్నారు. జగన్ ను విమర్శించడానికే శ్వేత పత్రం తీసుకొచ్చినట్టుందని మండిపడ్డారు. 

ఎక్కడైనా శ్వేత పత్రం అంటే సంబంధిత రంగంలో ఉన్న స్థితిగతులను వివరిస్తారని, అందుకు భిన్నంగా చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికే ప్రాధాన్యత ఇచ్చారని కాకాణి పేర్కొన్నారు.

అసలు, విద్యుత్ రంగాన్ని భ్రష్టుపట్టించిందే చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలో డిస్కంలు కుప్పకూలాయని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోకుండా విద్యుత్ ఒప్పందాలు చేసుకుంది ఎవరు, చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. సౌర విద్యుత్ ధరలు బాగా తగ్గిపోయిన స్థితిలో కూడా యూనిట్ కు రూ.7 చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. ట్రూఅప్ చార్జీలకు ఆద్యుడు చంద్రబాబేనని విమర్శించారు. 

చంద్రబాబు పదవి నుంచి తప్పుకునే నాటికి విద్యుత్ రంగంలో ఉన్న అప్పు రూ.86,215 కోట్లు అని వెల్లడించారు. 

2014 నుంచి 2019 వరకు టీడీపీ పాలన చూస్తే వృద్ధి రేటు 1.9 శాతం మాత్రమేనని... కానీ జగన్ పాలనలో విద్యుత్ రంగంలో వృద్ధిరేటు 4.7 శాతంగా నమోదైందని కాకాణి వెల్లడించారు. జాతీయ సగటు కంటే ఇదే అధికమని, కానీ చంద్రబాబు ఇవేవీ చెప్పకుండా... జగన్ ను విమర్శించేందుకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు.

  • Loading...

More Telugu News