KTR: రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి మరీ కాంగ్రెస్ కండువా కప్పుతున్నాడు: కేటీఆర్

KTR blames Revanth Reddy deffections

  • పార్టీ ఫిరాయింపులకు శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్‌ అని విమర్శ
  • ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కఠినతరం చేస్తామని గాలికి వదిలేసిందని ఆగ్రహం
  • దానం బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశారని వెల్లడి
  • అనర్హత వేటు పడేలా చట్టం తెస్తామని వారే ఫిరాయింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం
  • ఫిరాయింపులపై రాష్ట్రపతి, స్పీకర్‌ను కలుస్తామన్న కేటీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి మరీ కాంగ్రెస్ కండువాలు కప్పుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పార్టీ ఫిరాయింపులపై మాజీ మంత్రి హరీశ్ రావు, ఎంపీలు సురేశ్ రెడ్డి, దీవకొండ దామోదర్ రావు, వద్దిరాజు రవిచంద్రతో కలిసి కేటీఆర్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులకు శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్‌ అన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం మరింత కఠినతరం చేస్తామన్న కాంగ్రెస్ దానిని గాలికి వదిలేసి ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని విమర్శించారు.

ఆయారాం... గయారాం సంస్కృతికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీయే అన్నారు. 2014 కంటే ముందు ఉమ్మడి ఏపీలో పలుమార్లు ఫిరాయింపులను ప్రోత్సహించిందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని తాము పార్లమెంటులో ప్రస్తావిస్తామన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందని ఆరోపిస్తోన్న రాహుల్ గాంధీ తెలంగాణలో మాత్రం తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏకంగా లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేయడమంటే ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడమే అన్నారు. 

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఆటోమేటిక్‌గా అనర్హత వేటు వేసేలా పదో షెడ్యూల్‌కు సవరణలు చేస్తామని కాంగ్రెస్ న్యాయ పత్రలో హామీ ఇచ్చి తెలంగాణలో ఫిరాయింపుల ప్రోత్సహిస్తోందన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని నెరవేర్చలేదన్నారు. 2 లక్షల ఉద్యోగాలు, రుణమాఫీ హామీలు కూడా నెరవేర్చలేదన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను మర్చిపోయి ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలను చేర్చుకుందని ఎద్దేవా చేశారు.

పార్టీ ఫిరాయింపులపై అవసరమైతే రాష్ట్రపతిని, లోక్ సభ స్పీకర్‌ను కలుస్తామన్నారు. సుప్రీంకోర్టులో కేసు వేస్తామన్నారు. రాజ్యాంగ రక్షకుడిగా రాహుల్ గాంధీ ఆస్కార్ అవార్డు స్థాయిలో నటిస్తున్నారని... ఆచరణలో రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఒక్కో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేను కొనడానికి ఎంత ఖర్చు పెడుతున్నారని అంటూ మండిపడ్డారు.

  • Loading...

More Telugu News