G. Kishan Reddy: రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతి మహిళకు రూ.20 వేలు బాకీ పడింది: కిషన్ రెడ్డి

Kishan Reddy says Revanth Reddy government due rs 20 thousand to every woman

  • కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేని ఎన్నో హామీలు ఇచ్చిందని విమర్శ
  • కల్యాణలక్ష్మి, వృద్ధులకు పెన్షన్ వంటి హామీలను అమలు చేయలేదన్న కేంద్రమంత్రి
  • ఆర్ఆర్ ట్యాక్స్ విధించి రాహుల్ గాంధీ పర్యటనలకు ఖర్చు చేస్తున్నారని ఆరోపణ

అధికారంలోకి వచ్చాక మహిళలకు ప్రతి నెల రూ.2,500 ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని, ఈ లెక్కన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతి మహిళకు రూ.20 వేలు బాకీ పడ్డారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని ధర్నా చౌక్ వద్ద బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేని ఎన్నో హామీలు ఇచ్చిందని విమర్శించారు. వృద్ధులకు రూ.4 వేల పెన్షన్ ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలని నిలదీశారు.

కల్యాణలక్ష్మి కింద రూ.1 లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని కూడా చెప్పారని... కానీ ఇంతవరకు ఇచ్చింది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించి... బస్సులను తగ్గించారని ఆరోపించారు. తెలంగాణలో మహిళలకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదని... అందుకే వారి తరఫున ప్రశ్నించే బాధ్యతను తాము తీసుకున్నామన్నారు. హామీల అమలు కోసం ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెస్తామని వ్యాఖ్యానించారు. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను పక్కన పెట్టేసిందని విమర్శించారు.

తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ విధించి... రాహుల్ గాంధీ పర్యటనల కోసం ఆ పన్నులు ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ఇచ్చిన హామీలను ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలన్నారు. అసలు పథకాల పేరుతో తెస్తోన్న అప్పులను ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. మహిళలపై ముఖ్యమంత్రికి ఏమాత్రం గౌరవం ఉన్నా బెల్ట్ దుకాణాలు మూసేయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం ఏర్పడి పదేళ్లైనా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని గుర్తు చేశారు. దీంతో మహిళలు గ్యాస్ కనెక్షన్లు తీసుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. కొత్త రేషన్ కార్డులు ఇస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టమేమిటని ప్రశ్నించారు. తెల్ల రేషన్ కార్డు వున్న ప్రతి ఒక్కరికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వమే బియ్యం ఇస్తోందన్నారు.

  • Loading...

More Telugu News