Loan App: కిడ్నీ అమ్ముకున్న లోన్ యాప్ బాధితుడు.. అయినా ఆగని వేధింపులు!
- విజయవాడలో ఫేక్ డాక్యుమెంట్స్ తో సర్జరీ
- 30 లక్షలు ఇస్తామని చెప్పి రూ.లక్ష చేతిలో పెట్టారని ఆవేదన
- అటు లోన్ యాప్ వేధింపులు.. ఇటు ఏజెంట్ల మోసం
లోన్ యాప్ ల ద్వారా అప్పటికప్పుడు డబ్బు చేతికి అందుతోంది.. అయితే, అత్యవసరంలో డబ్బు తీసుకున్న వారు తిరిగి చెల్లించేటపుడు కంగుతింటున్నారు. వడ్డీ, చక్రవడ్డీ, భూచక్రవడ్డీ.. ఇలా రకరకాల పేరుతో తీసుకున్న రుణానికి పదుల రెట్లలో వసూలు చేస్తున్నారు. ఎంత చెల్లించినా లోన్ యాప్ రుణం మాత్రం తీరలేదని చెబుతూ వేధింపులకు పాల్పడుతున్నారు. దీంతో ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తాజాగా గుంటూరుకు చెందిన ఓ ఆటోడ్రైవర్ లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక కిడ్నీ అమ్ముకున్నాడు. అయితే, అక్కడ కూడా మోసపోయానని, ఏజెంట్లు తనను నిలువునా ముంచేశారని వాపోతున్నాడు.
గుంటూరుకు చెందిన 31 ఏళ్ళ ఆటో డ్రైవర్ లోన్ యాప్ ద్వారా రుణం తీసుకున్నాడు. తీసుకున్న మొత్తం చెప్పిన టైమ్ లోగా కట్టేశాడు. అయితే, రుణం ఇంకా తీరలేదని, మిగతా మొత్తం వెంటనే చెల్లించాలని యాప్ నిర్వాహకులు వేధింపులకు దిగారు. ఈ క్రమంలోనే కిడ్నీ దానం చేస్తే రూ.30 లక్షలు ఇస్తామంటూ ఫేస్ బుక్ లో ఓ యాడ్ కనిపించింది. అందులోని ఫోన్ నెంబర్ ను సంప్రదించగా.. విజయవాడలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లి, ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి కిడ్నీ తీసుకున్నారు. ఆ తర్వాత డబ్బులు అడిగితే నెలల పాటు తిప్పించుకుని ఏడు నెలల తర్వాత రూ. లక్ష చేతిలో పెట్టారని ఆటోడ్రైవర్ ఆవేదన వ్యక్తంచేశాడు. మరోవైపు, లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు రోజురోజుకూ పెరుగుతున్నాయని, ఇటు ఏజెంట్లు మోసం చేశారని కన్నీటిపర్యంతమయ్యాడు.