Mallu Bhatti Vikramarka: వైఎస్ ఇచ్చిన ప్రోత్సాహం వల్లే నేను, రేవంత్ రెడ్డి ఈ స్థాయికి వచ్చాం!: భట్టివిక్రమార్క

Bhattivikramarka in YSR Jayanthi

  • వైఎస్ పాలనలో పని చేసే భాగ్యం కలిగిందన్న భట్టివిక్రమార్క
  • వైఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలు ఎంతోమంది జీవితాలను నిలబెట్టాయని వ్యాఖ్య
  • తనకు ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా అవకాశమిచ్చారని వ్యాఖ్య

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాను ఒకేసారి మండలిలో అడుగు పెట్టామని... తమ ఇద్దరికీ వైఎస్ పాలనలో పని చేసే భాగ్యం కలిగిందని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఆయన ఇచ్చిన ప్రోత్సాహం వల్లే తాము ఈరోజు ఈ స్థాయికి వచ్చామన్నారు. మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్‌లో వైఎస్సార్ జయంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ వేదికపై మనం గొప్ప నాయకుడి వారసులుగా కూర్చున్నామని వ్యాఖ్యానించారు. తనకు ఈ అవకాశమిచ్చినందుకు (వేడుకల్లో పాల్గొనడం) షర్మిలకు ధన్యవాదాలు తెలిపారు.

వైఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలు ఎంతోమంది జీవితాలను నిలబెట్టాయన్నారు. ఐటీ రంగంలో తెలుగువారి సంఖ్య ఎక్కువగా ఉందంటే అందుకు వైఎస్సే కారణమన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్స్ ఎందరో జీవితాలను మార్చిందన్నారు. పాలన అంటే ఎలా ఉండాలో ఆయన చేసి చూపించారన్నారు. ఉచిత కరెంట్ ఇవ్వడం ద్వారా రైతుల ఆత్మహత్యలను ఆపగలిగామన్నారు. తాను ప్రస్తుతం తెలంగాణ ఉపముఖ్యమంత్రిగా ఉన్నానంటే అందుకు వైఎస్ ఇచ్చిన రాజకీయ అవకాశాలే కారణమని గుర్తు చేసుకున్నారు.

తనకు ఎమ్మెల్సీగా, ఆ తర్వాత ఎమ్మెల్యేగా అవకాశమిచ్చారన్నారు. రాజకీయ పాఠాలు నేర్చుకున్నామన్నారు. భవిష్యత్తులో రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడం కోసం మనమంతా పని చేద్దామని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలనేది వైఎస్ రాజశేఖరరెడ్డి చివరి కోరిక అని... ఆ లక్ష్యాన్ని చేరుకునేలా ముందుకు సాగుదామన్నారు.

More Telugu News