Free Sand Policy: ఉచితం ముసుగులో టీడీపీ నేతలు కోట్లాది రూపాయల ఇసుక దోచేస్తున్నారు: వైసీపీ నేత ఉమాశంకర్ గణేశ్

YCP leader Umashankar Ganesh slams TDP leaders on free sand policy

  • ఏపీలో నేటి నుంచి నూతన ఇసుక విధానం అమలు
  • ఉచితంగా ఇసుక వస్తుందని ప్రజలు ఎంతో ఆశపడ్డారన్న ఉమాశంకర్ గణేశ్
  • బోర్డుపై టన్నుకు రూ.1,225 రేటు చూసి వెనక్కి వచ్చేశారని వెల్లడి

ఏపీ ప్రభుత్వం నేటి నుంచి రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమలు చేస్తోంది. అయితే, ఉచిత ఇసుక ముసుగులో ప్రజలకు టీడీపీ కూటమి ప్రభుత్వం కుచ్చుటోపీ పెడుతోందని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పేట్ల ఉమాశంకర్ గణేశ్ ధ్వజమెత్తారు. ఉచితం ముసుగులో టీడీపీ నేతలు కోట్లాది రూపాయల ఇసుక దోచేస్తున్నారని ఆరోపించారు. 

"కూటమి నేతలు ఉచితంగా ఇసుక ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం వస్తే ఉచితంగా ఇసుక లభిస్తుందని చాలామంది ఆశపడ్డారు. ఇవాళ 8వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ఇసుక ఇస్తున్నట్టు ప్రభుత్వం చెప్పింది. దాంతో మా నర్సీపట్నం ఇసుక స్టాక్ పాయింట్ వద్దకు చాలామంది వెళ్లారు. కానీ అక్కడి బోర్డు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. టన్ను ఇసుక ధర రూ.1,225 అని బోర్డు మీద రాసి ఉంది. ఉచితం అని చెప్పి, ఇలా డబ్బులు వసూలు చేయడం దుర్మార్గం. ఇసుక రేట్లు చూసి నర్సీపట్నం ప్రజలు చాలామంది వెనక్కి తిరిగి వచ్చేశారు. 

ఇటీవలి వరకు నర్సీపట్నం స్టాక్ పాయింట్ లో లక్ష టన్నుల ఇసుక ఉండాలి... కానీ అందులో 60 వేల టన్నుల ఇసుక మాయమైంది. ఇప్పుడు అడిగితే 40 వేల టన్నుల ఇసుకే ఉందంటున్నారు. కలెక్టర్ దీనిపై చర్యలు తీసుకోవాలి. రికార్డులు తెప్పించి పరిశీలించాలి. రూ.5 కోట్ల విలువ చేసే ఈ 40 వేల టన్నుల ఇసుకనైనా కాపాడాలి" అని ఉమాశంకర్ గణేశ్ కోరారు. 

ఉమాశంకర్ గణేశ్ టాలీవుడ్ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ సోదరుడు అని తెలిసిందే.

More Telugu News