Sikandar Raza: 'వరల్డ్ ఛాంపియన్లు చివరికి వరల్డ్ ఛాంపియన్లలాగే ఆడారు'.. టీమిండియాపై సికిందర్ రజా ప్ర‌శంస‌ల జ‌ల్లు!

World champions played like world champions Sikandar Raza praises Team India

  • హ‌రారే వేదిక‌గా భార‌త్‌, జింబాబ్వే రెండో టీ20
  • 100 పరుగుల తేడాతో టీమిండియా బంప‌ర్ విక్ట‌రీ
  • భార‌త జ‌ట్టు రాణించిన తీరుపై జింబాబ్వే సారధి ప్ర‌శంస‌లు

ఐదు టీ20ల కోసం జింబాబ్వే పర్యటనలో ఉన్న టీమిండియా హ‌రారే వేదిక‌గా జ‌రిగిన‌ రెండో టీ20లో ఘ‌న‌ విజయం సాధించిన విష‌యం తెలిసిందే. తొలి టీ20లో 102 పరుగులకే కుప్పకూలి ఓట‌మి చ‌విచూసిన యువ భార‌త్‌ రెండో మ్యాచ్‌లో అద్భుతంగా పుంజుకొని 100 పరుగుల తేడాతో బంప‌ర్ విక్ట‌రీ న‌మోదు చేసింది. అయితే, త‌మ జ‌ట్టు ప‌రాజ‌యాన్ని అంగీకరిస్తూ జింబాబ్వే సారధి సికిందర్ రజా మ్యాచ్ అనంతంరం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. వ‌ర‌ల్డ్‌ ఛాంపియన్లు చివరికి ఛాంపియన్లలాగే ఆడతారని టీమిండియాపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించాడు. 

జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా మాట్లాడుతూ.. "వరల్డ్ ఛాంపియన్లు చివరికి ఛాంపియన్లలాగే ఆడతారు. మేము క్యాచ్లు జారవిడచడం వల్ల మ్యాచ్ చేజారింది. ఈ వికెట్‌పై 200 ర‌న్స్‌ సాధ్యమే అనుకున్నా. కానీ, వాళ్లు (భార‌త్‌) మరో 30 పరుగులు అదనంగా సాధించారు. ఇక ఛేదనలో కూడా మేం అనుకున్నంత స్థాయిలో రాణించలేపోయాం. ఎంతో పాజిటివ్ మైండ్‌సెట్‌తో మ్యాచ్ ఆడిన‌ప్ప‌టికీ అనుభ‌వ‌లేమితో ప‌లు స‌మ‌స్య‌లు తలెత్తాయి" అని సికిందర్ రజా చెప్పుకొచ్చాడు. 

ఇదిలాఉంటే.. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భార‌త జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 2 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 234 పరుగుల భారీ స్కోర్ చేసింది. యువ సంచ‌ల‌నం అభిషేక్ శ‌ర్మ 46 బంతుల్లోనే శ‌త‌కం బాదాడు. అత‌నికి తోడు రుతురాజ్ గైక్వాడ్‌, రింకూ సింగ్ కూడా బ్యాట్ ఝుళిపించ‌డంతో టీమిండియా భారీ స్కోర్ చేసింది. అనంతరం 235 ప‌రుగుల భారీ ఛేదనలో ఆతిథ్య జ‌ట్టు 134 పరుగులకే కుప్పకూలింది. దీంతో శుభ్‌మ‌న్ గిల్ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు 100 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. ఐదు టీ20ల సిరీస్‌లో ప్ర‌స్తుతం ఇరుజ‌ట్లు 1-1తో స‌మంగా ఉన్నాయి.

  • Loading...

More Telugu News