Subman Gill: సూపర్ సెంచరీ వెనుక రహస్యాన్ని బయటపెట్టిన యువ బ్యాటర్ అభిషేక్ శర్మ

Subman Gills bat is my Secret Behind Century says Abhishek Sharma

  • కెప్టెన్ బ్యాటే తన సెంచరీ సీక్రెట్ అన్న అభిషేక్ 
  • ఒత్తిడిలో ఉన్నప్పుడు అతడి బ్యాట్ తీసుకొని ఆడతానంటూ వెల్లడి
  • భయం లేకుండా షాట్లు ఆడడంలో యువరాజ్, తన తండ్రి సాయం చేశారన్న శర్మ

జింబాబ్వేపై అరంగేట్ర మ్యాచ్‌లో డకౌట్ అయిన యంగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ మరుసటి రోజే జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో అదరగొట్టాడు. అత్యంత దూకుడుగా ఆడి కేవలం 47 బంతుల్లో సెంచరీ బాదాడు. దీంతో రెండవ మ్యాచ్‌లోనే సెంచరీ అందుకున్న యువ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అయితే తన చిన్ననాటి స్నేహితుడు, ప్రస్తుత కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ వద్ద తీసుకున్న బ్యాటే తన సెంచరీ వెనుకున్న రహస్యమని అభిషేక్ శర్మ అన్నాడు. ఒత్తిడిగా ఉన్నప్పుడు అతడి వద్ద బ్యాట్ తీసుకొని ఆడేవాడినని, ఇప్పుడు కూడా అదే చేసి విజయవంతమయ్యానని తన సెంటిమెంట్‌ను బయటపెట్టాడు. ఒత్తిడిలో ఉన్నప్పుడు అతడి బ్యాట్ తీసుకొని ఆడితే కలిసొస్తుందని వివరించాడు.

అండర్-12 నుంచి గిల్‌తో తన స్నేహ బంధం మొదలైందని, అతడితో స్నేహ బంధం అందమైనదని అభిషేక్ వ్యాఖ్యానించాడు. అండర్-12 నుంచి కలిసి ఆడే వాళ్లమని, తాను టీమిండియాకు ఎంపికైనప్పుడు మొదటి ఫోన్ కాల్ శుభ్‌మాన్ గిల్ నుంచే వచ్చిందని వెల్లడించారు. జింబాబ్వేతో మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ మీట్‌లో ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. చిన్న వయసు నుంచి గిల్ బ్యాట్‌తో ఆడేవాడినని, ఈ రోజు (శనివారం) కూడా ఆడానని, అందుకే అతడి బ్యాట్‌కు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నానని అన్నాడు. ఇక ఐపీఎల్‌లో కూడా గిల్ బ్యాట్‌తో ఆడానని అభిషేక్ శర్మ ప్రస్తావించాడు.

ఇక తాను భయం బెరుకు లేకుండా బ్యాటింగ్ చేయగలగడంలో భారత మాజీ బ్యాటర్ యువరాజ్ సింగ్‌తో పాటు తన తండ్రి సహకారం ఉందని వెల్లడించారు. కాగా శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో డకౌట్ కావడంతో కాస్త ఒత్తిడిగా అనిపించిందని అన్నాడు. అయితే ఒత్తిడిని నియంత్రించుకునే విషయంలో యువ ఆటగాళ్లకు ఐపీఎల్ ఎంతో ఉపయోగపడుతోందని, అరంగేట్ర ఆటగాళ్లు భారత్ తరపున ఆడుతున్నప్పుడు పెద్దగా ఒత్తిడి కలగదని అన్నాడు.

కాగా హరారే వేదికగా జింబాబ్వేతో ఆదివారం జరిగిన రెండవ టీ20లో శుభమాన్ గిల్‌తో కలిసి ఓపెనర్‌గా వచ్చిన అభిషేక్ శర్మ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. జింబాబ్వే బౌలర్లను ఊచకోత కోసి 47 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో సెంచరీని పూర్తి చేశాడు. ఆ వెంటనే ఔటయ్యాడు. అయితే భారత్ 100 పరుగుల తేడాతో గెలిచేందుకు తను బాటలు వేశాడు.

  • Loading...

More Telugu News