Stag Beetle: ఈ పురుగు ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఏకంగా రూ. 75 లక్షలు పలుకుతున్న స్టాగ్ బీటిల్!
- ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన కీటకాల్లో ఒకటిగా రికార్డు
- స్టాగ్ బీటిల్ కోసం భారీ ధర వెచ్చిస్తున్న ఔత్సాహికులు
- ఈ పురుగుతో అదృష్టం కలిసొస్తుందని నమ్మకం
- రాత్రికి రాత్రే ధనవంతులను చేస్తుందని కొందరి విశ్వాసం
‘పురుగుకన్నా హీనంగా చూశారు.. పురుగులా తీసిపడేశారు’ అంటూ ఇంకెప్పుడూ పురుగులను విలువ లేని వాటిగా జమకట్టకండి సుమా! ఎందుకంటే.. వాటిల్లోనూ బీఎండబ్ల్యూ, ఆడి లాంటి లగ్జరీ కార్లంత ధర పలికే పురుగులు కూడా ఉన్నాయండోయ్! వాటి కోసం రూ. వందలు, వేలు కాదు.. ఏకంగా రూ. లక్షలు వెచ్చించేందుకు కూడా కొందరు ఎగబడుతున్నారు. ఇంతకీ అవేం పురుగులు అంటారా? ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన కీటకాల్లో ఒకటైన స్టాగ్ బీటిల్. ప్రస్తుతం దీని రేటు కళ్లుచెదిరేలా ఏకంగా రూ. 75 లక్షలు పలుకుతోంది!
మన భాషలో చెప్పాలంటే ఇది ఒక రకమైన కుమ్మరి పురుగు లేదా పేడ పురుగే. కాకపోతే వాటిలో ఇవి ఓ ప్రత్యేకమైన రకం. దుప్పులకు తలపై కొమ్ములు ఉన్నట్లుగానే ఈ పురుగులకు కూడా రెండు కొమ్ములు ఉంటాయి. అందుకే వీటికి స్టాగ్ బీటిల్ అనే పేరు వచ్చింది.
ఇంతకీ వాటికి అంత రేటు ఎందుకు పలుకుతోందో తెలుసా? ఇవి అదృష్ట కీటకాలట. అంటే స్టాగ్ బీటిల్ ఇంట్లో కాలుపెట్టగానే ఇంటి ఓనర్ కు లక్ తన్నుకొస్తుందట! రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేస్తుందట! అందుకే ఎంత ధర అయినా సరే వెచ్చించేందుకు ఔత్సాహికులు వెనకాడటం లేదు. పైగా ఈ పురుగు అరుదైన జాతికి చెందినది కావడం కూడా వాటి భారీ ధరకు కారణమవుతోంది.
లండన్ లోని నేచురల్ హిస్టరీ మ్యూజియం పేర్కొన్న వివరాల ప్రకారం స్టాగ్ బీటిల్ పురుగులు 2 నుంచి 6 గ్రాముల మధ్య బరువు ఉంటాయి. సగటున మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జీవిస్తాయి. మగ పురుగులు 3.5 సెంటీమీటర్ల నుంచి 7.5 సెంటీమీటర్ల పొడవుంటే ఆడ పురుగులు మాత్రం 3 నుంచి 5 సెంటీమీటర్ల పొడవే ఉంటాయి. ఈ పురుగులను ఔషధాల కోసం కూడా ఉపయోగిస్తుంటారు.
స్టాగ్ బీటిల్స్ చలిని తట్టుకోలేవు. అందుకే ఇవి ఉష్ణ మండల ప్రాంతాల్లో నివసిస్తాయి. తోటలు, పార్కుల్లో ఎక్కువగా కనిపిస్తాయి. చచ్చిపోయి కుళ్లిపోయే చెట్లపైనే ఎక్కువగా జీవిస్తాయి. చెట్లలోని తీయని ద్రవాన్ని ఆహారంగా తీసుకుంటాయి. అలాగే కుళ్లిన పండ్లలోని రసాన్ని తాగుతాయి.