Telangana: సాయంత్రం చంద్రబాబు-రేవంత్ రెడ్డి కీలక సమావేశం... తెలంగాణ డిమాండ్లివే!

Telangana demands in Chandrabahu and Revanth Reddy meeting

  • ప్రధానంగా షెడ్యూల్ 9, 10లలోని సంస్థల విభజనపై చర్చించే అవకాశం
  • 7 మండలాలను తిరిగి తెలంగాణలో కలపాలని డిమాండ్
  • తీర ప్రాంతం, ఓడరేవుల్లో భాగం అడుగుతోన్న తెలంగాణ

హైదరాబాద్‌లోని ప్రజాభవన్ వేదికగా ఈరోజు సాయంత్రం ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. పదేళ్లుగా పరిష్కారం కాని వివిధ అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. ప్రధానంగా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లలో ఉన్న సంస్థల విభజనపై చర్చించే అవకాశాలు ఉన్నాయి.

షెడ్యూల్ 9లోని మొత్తం 91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోంశాఖ షీలా బీడే కమిటీని వేసింది. ఇందులో 23 సంస్థల పంపిణీపై ఏపీ, తెలంగాణల మధ్య ఏకాభిప్రాయం కదరలేదు. పదో షెడ్యూల్‌లోని 142 సంస్థల్లోని ముప్పై అంశాలపై వివాదం కొనసాగుతోంది. 

ఏపీ ప్రభుత్వం తమకు రూ.24 వేల కోట్లు చెల్లించాల్సి ఉందని తెలంగాణ చెబుతోంది. కానీ తెలంగాణనే తమకు రూ.7 వేల కోట్లు చెల్లించాల్సి ఉందని ఏపీ చెబుతోంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక విభజన అంశాల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించారు. మార్చిలో ఢిల్లీలోని ఏపీ భవన్ సమస్యను, ఇటీవల మైనింగ్ కార్పోరేషన్ నిధుల పంపిణీని పరిష్కరించుకున్నారు.

పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 9లోని మొత్తం ఆస్తుల విలువలో రెండు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదిరిన సంస్థల వాటా 0.7 శాతమేనని చెబుతున్నారు. ఏకాభిప్రాయం కుదరని సంస్థలే కీలకంగా ఉన్నాయి. అన్నింటిని కలిపి జనాభా నిష్పత్తిలో పంపిణీ చేయాలని ఏపీ డిమాండ్ చేస్తుండగా, తెలంగాణ మాత్రం అంగీకరించడం లేదు. ఎక్కడ ఉన్న సంస్థలు వారివే అని చెబుతోంది. షెడ్యూల్ 10లోని ఆస్తుల విలువ రూ.38 వేల కోట్లుగా అంచనా వేసినట్లుగా తెలుస్తోంది. షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లలో పేర్కొనని దాదాపు రూ.1,759 కోట్ల విలువైన మరో 12 సంస్థలపై ఏకాభిప్రాయం కుదరాల్సి ఉందని చెబుతున్నారు.

తెలంగాణ డిమాండ్లివే...

ఆర్డినెన్స్ ద్వారా ఏపీలో కలిపిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను తిరిగి తమ రాష్ట్రంలో చేర్చాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. ఏపీకి 1000 కిలో మీటర్ల మేర విస్తారమైన కోస్టల్ కారిడార్ ఉన్నందున... ఈ తీరప్రాంతంలో తెలంగాణ భాగం కోరుతోంది. తెలంగాణకు ఓడరేవులు లేనందున కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టుల్లో భాగం అడుగుతోంది. టీటీడీలో తెలంగాణకు భాగం ఉండాలని అడుగుతోంది. కృష్ణా జలాల్లో 811 టీఎంసీల నీటి లభ్యత ఉండగా... అంతర్జాతీయ నీటి పంపిణీ సూత్రం ప్రకారం క్యాచ్‌మెంట్ ఏరియా నిష్పత్తిలో నీటి పంపకాలు జరగాలని తెలంగాణ అడుగుతోంది. అదేవిధంగా తెలంగాణకు 558 టీఎంసీల నీటిని కేటాయించాలని కోరుతోంది. తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఏపీ విద్యుత్ సంస్థలు వెంటనే రూ.24 వేల కోట్ల బకాయిలను చెల్లించాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. ఏపీకి చెల్లించాల్సినవి ఏమైనా ఉంటే... మేం సిద్ధమేనని తెలంగాణ అంటోంది.

  • Loading...

More Telugu News