Golconda Bonalu: గోల్కొండ బోనాల జాతర రేపు తొలి బోనం.. పూర్తయిన మెట్ల పూజ

Golconda Fort decked up for Bonalu celebrations from Sunday

  • ఆదివారం నుంచి నెల రోజుల పాటు జరగనున్న జాతర
  • అన్ని ఏర్పాట్లు చేశామంటున్న అధికారులు
  • సిటీలో ముస్తాబైన అమ్మవారి ఆలయాలు

గోల్కొండ బోనాల జాతర ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. కోటలోని అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ప్రారంభమయ్యే ఈ వేడుక సిటీలో దాదాపు నెల రోజుల పాటు జరగనుంది. కోటలోని అమ్మవారికి తొట్టెల, ఫలహార బండ్ల ఊరేగింపులు, రంగం, బలిగంప ఊరేగింపు వంటి వాటితో నగర వీధులు కోలాహలంగా మారనున్నాయి. ఈ నెల 14న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి, 21న లాల్ దర్వాజ శ్రీ సింహవాహిని అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తారు. తిరిగి గోల్కొండ కోటలో బోనాల సమర్పణతో వేడుక ముగియనుంది.

జాతర ప్రారంభ సూచికగా జగదాంబిక అమ్మవారి ఆలయ మార్గంలోని మెట్లకు స్థానికులు శుక్రవారం పూజలు చేశారు. సిటీలో అత్యంత వేడుకగా జరిగే బోనాల జాతర కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెప్పారు. సిటీలోని అమ్మవారి ఆలయాలను అందంగా ముస్తాబు చేసినట్లు వెల్లడించారు. సంబరాలు ప్రశాంతంగా జరిగేలా పలు సెన్సిటివ్ ఏరియాలలో బలగాలను మోహరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

భక్తుల కోసం తాగునీటి కేంద్రాలు..
బోనాలకు వచ్చే భక్తుల కోసం గోల్కొండ కోటలో పలుచోట్ల తాగునీటి కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జలమండలి అధికారులు తెలిపారు. కోట మెట్ల దగ్గరి నుంచి బోనాలు జరిగే ప్రాంతం వరకు డ్రమ్ములు, ట్యాంకులు, పంపులను ఏర్పాటు చేశారు. బోనాలు సమర్పించాక భక్తులు వంట చేసుకోవడానికి వీలుగా స్టాండ్లు కూడా సిద్ధం చేసినట్లు తెలిపారు. వాటర్ ప్యాకెట్లు, గ్లాసులు, వాటర్ క్యాంపుల దగ్గర టెంట్లు కూడా ఏర్పాటు చేశారు.

రామదాసు బంధిఖాన, చోటాబజార్, జీహెచ్ఎంసీ వార్డు కార్యాలయం, లంగర్ హౌజ్ వద్ద కూడా భక్తులకు తాగు నీరు అందించే ఏర్పాట్లు చేశామని తెలిపారు. కాగా, ఆషాఢ మాసం బోనాల జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. శుక్రవారం గోల్కొండ కోటలో బోనాల జాతర ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.

  • Loading...

More Telugu News