Centipede In Amul Ice Cream: ‘అమూల్ ఐస్‌క్రీమ్‌లో జెర్రె’ ఫొటోను తొలగించాలి.. మహిళకు హైకోర్టు ఆదేశం

Delhi Court Directs Removal Of Post Alleging Centipede In Amul Ice Cream

  • మహిళ పెట్టిన ఫొటోపై అభ్యంతరం చెబుతూ గుజరాత్ మిల్క్ ఫెడరేషన్ కేసు
  • తమ ఉత్పత్తులు కలుషితమయ్యేందుకు అవకాశమే లేదని వాదన
  • నాణ్యతా పరంగా అనేక జాగ్రత్తలు, బహుళ దశల్లో తనిఖీలు నిర్వహిస్తామని వెల్లడి
  • తమ నోటీసుకు నెటిజన్లు స్పందించలేదని, పరీక్షల నిమిత్తం ఐస్‌‌క్రీమ్‌ను అప్పగించలేదన్న సంస్థ
  • విచారణకు నెటిజన్లు గైర్హాజరవడంతో పోస్టు తొలగించాలంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశం

అమూల్ ఐస్‌క్రీమ్‌లో జెర్రె ఉన్నట్టు సోషల్ మీడియాలో పెట్టిన ఫొటోతో పాటూ ఆ పోస్టును కూడా తొలగించాలంటూ ఢిల్లీ హైకోర్టు ఓ మహిళా నెటిజన్‌ను గురువారం ఆదేశించింది. మరే ఇతర సామాజిక మాధ్యమాల్లోనూ ఈ ఫొటో పోస్టు చేయొద్దని స్పష్టం చేసింది. అమూల్ సంస్థ వేసిన కేసులో మహిళ విచారణకు గైర్హాజరైన నేపథ్యంలో కోర్టు ఈ మేరకు ఆదేశించింది. 

పూర్తి వివరాల్లోకి వెళితే, సదరు మహిళతో పాటు మరో నెటిజన్‌పై గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (అమూల్) కోర్టును ఆశ్రయించింది. ఐస్‌‌క్రీమ్‌లో జెర్రె ఫొటోను తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ అభ్యర్థించింది. తమ ఉత్పత్తుల్లో నాణ్యత ఉండేలా అనేక రకాల జాగ్రత్తలు తీసుకుంటామని, బహుళ దశల్లో తనిఖీలు చేస్తామని అమూల్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. తమ కేంద్రాలకు ఐఎస్ఐ సర్టిఫికేషన్ ఉందని, ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ నిబంధనలను తు.చ తప్పకుండా పాటిస్తామని వెల్లడించింది. పాల సేకరణ నుంచి మార్కెటింగ్ వరకూ ప్రతి దశలోనూ నాణ్యత పెంపొందించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. తమ ఉత్పత్తులు కలుషితమయ్యే అవకాశమే లేదని స్పష్టం చేసింది. జెర్రె ఉన్న ఐస్‌క్రీమ్‌ను పరీక్షల కోసం తమకు అప్పగించేందుకు మహిళ తిరస్కరించిందనే విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. 

కాగా, ఈ కేసుకు సంబంధించి అమూల్ సంస్థ ముందుగానే పంపించిన నోటీసులకు మహిళ స్పందించక పోవడాన్ని కోర్టు ప్రస్తావించింది. పరీక్ష నిమిత్తం ఐస్‌‌‌క్రీమ్‌ను సంస్థకు అప్పగించేందుకు నిరాకరించడం, ఘటనపై దర్యాప్తునకు సహకరించకపోవడం, విచారణ సమయంలో ఇద్దరు నెటిజన్లు కోర్టు ముందు హాజరు కాకపోవడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు నెటిజన్లు పెట్టిన ఫొటో, పోస్టును తక్షణం తొలగించాలంటూ ఆదేశించింది. విచారణను మరో తేదికి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News