Nara Lokesh: కొత్తగా వచ్చే పారిశ్రామికవేత్తలతో ఫ్రెండ్లీగా ఉండండి: ఏపీ మంత్రి నారా లోకేశ్

AP Minister Nara Lokesh reviews on IT and Electronics ministry

  • నేడు ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రి లోకేశ్ సమీక్ష
  • హాజరైన ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ ఉన్నతాధికారులు
  • కొత్తగా వచ్చే పారిశ్రామికవేత్తల్లో నమ్మకం కలిగించాలన్న లోకేశ్
  • 2019కి ముందు ఉన్న ఇన్వెస్ట్ మెంట్స్ పోర్టల్ పునరుద్ధరించాలని ఆదేశం

ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ నేడు ఉండవల్లిలోని తన నివాసంలో కీలక సమీక్ష చేపట్టారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల ప్రస్తుత స్థితి, రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు గల అవకాశాలపై ఉన్నతాధికారులతో చర్చించారు. 

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలతోపాటు కొత్తగా రావడానికి ఆసక్తి చూపే పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని పెంపొందించడానికి అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో కొత్తగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలను ఆకర్షించడానికి మెరుగైన విధానాలతో నూతన ఐటీ పాలసీని తీసుకురానున్నామని, ఇందుకోసం పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. 

ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టుబడుల పర్యవేక్షణకు గతంలో (2019కి ముందు) ఉన్న పోర్టల్ ను మరింత మెరుగ్గా తీర్చిదిద్ది అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి లోకేశ్ ఆదేశించారు. విశాఖపట్నంలో ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు అందుబాటులో ఉన్న ప్లగ్ అండ్ ప్లే ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పై నివేదిక ఇవ్వాలని అధికారులను కోరారు. 

అదేవిధంగా విశాఖ, పరిసరాల్లో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటుచేసేందుకు ఆసక్తి చూపే పారిశ్రామికవేత్తలకు ఏమేరకు భూమి అందుబాటులో ఉందో పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగ పరిశ్రమదారులతో సమావేశమై వారి సమస్యలు, అవసరాలను తెలుసుకొని పరిష్కరించాలని, పారిశ్రామికవేత్తలతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు. 

ఈ సమావేశంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల కార్యదర్శి కోన శశిధర్, జాయింట్ డైరెక్టర్ (ప్రమోషన్స్) సూర్జిత్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ సీఈవో అనిల్ కుమార్, ఎపిటా జనరల్ మేనేజర్ విజయకాంత్ తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News