Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొంటున్న ఏపీ అథ్లెట్లు జ్యోతి యర్రాజి, జ్యోతికలకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు

Chandrababu and Nara Lokesh wishes all the best for Jyothi Yarraji and Jyothika Sri in Paris Olympics

  • జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు పారిస్ లో ఒలింపిక్స్ క్రీడలు
  • భారత బృందంలో ఏపీ మహిళా అథ్లెట్లు జ్యోతి, జ్యోతికలకు స్థానం
  • అందరూ గర్వించేలా పతకాలు తీసుకురావాలన్న చంద్రబాబు, లోకేశ్

జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు పారిస్ నగరంలో ఒలింపిక్స్ క్రీడా సంరంభం జరగనున్న సంగతి తెలిసిందే. ప్రతిష్ఠాత్మక క్రీడోత్సవం అయిన ఒలింపిక్స్ లో పాల్గొనడం ప్రతి ఒక్క అథ్లెట్ కల. ఈసారి పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనే భారత బృందంలో ఏపీకి చెందిన ఇద్దరు మహిళా అథ్లెట్లు కూడా ఉన్నారు. వారు జ్యోతి యర్రాజి, దండి జ్యోతిక శ్రీ. 

ఈ నేపథ్యంలో, ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. దండి జ్యోతిక శ్రీ, జ్యోతి యర్రాజి ఫ్రాన్స్ లో జరిగే ఒలింపిక్స్ లో పాల్గొనబోతుండడం ఆంధ్రప్రదేశ్ కు గర్వకారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. పేద కుటుంబాల నుంచి వచ్చిన ఈ ఆణిముత్యాలు క్రీడా జగత్తులో ఎనలేని కీర్తిప్రతిష్ఠలు సాధించాలని, రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు. 

ఇక, నారా లోకేశ్ స్పందిస్తూ... ఏపీకి చెందిన ఇద్దరు మహిళా అథ్లెట్లు పారిస్ ఒలింపిక్స్-2024లో భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తుండడం పట్ల గర్వంగా ఉందని తెలిపారు. ఏళ్ల తరబడి వారు చేసిన కఠోర శ్రమ, చిందించిన చెమటకు ఇది ప్రతిఫలం అని పేర్కొన్నారు. 

వారు ఓటమిని అంగీకరించే అథ్లెట్లు కాదని, అచంచలమైన పట్టుదలతో రాణిస్తారని ధీమా వ్యక్తం చేశారు. తప్పకుండా పతకాలు సాధించి ఒలింపిక్స్ కల నెరవేర్చుకుంటారన్న నమ్మకం తనకుందని లోకేశ్ పేర్కొన్నారు. తామందరినీ గర్వపడేలా చేయాలని, ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నానని వివరించారు.

  • Loading...

More Telugu News