Karthik Reddy: అదే నిజమైతే 120 రోజులుగా కవిత జైల్లో ఎలా ఉంటుంది?: పటోళ్ల కార్తీక్ రెడ్డి

Karthik Reddy questions Congress over allegations

  • బీజేపీతో కేసీఆర్ కాంప్రమైజ్ అయితే కవిత జైల్లో ఉంటుందా? అని ప్రశ్న
  • తెలంగాణలో టీడీపీని వాడుకుని బీఆర్ఎస్‌ను కాంగ్రెస్ ఇబ్బంది పెడుతోందని విమర్శ
  • రాబోయే రోజుల్లో మరిన్ని చిత్రాలు చూస్తామన్న కార్తీక్ రెడ్డి
  • తాను, తన తల్లి పార్టీ మారబోమని స్పష్టీకరణ

మద్యం పాలసీ కేసులో కవితను విడిపించుకోవడం కోసం బీజేపీతో కేసీఆర్ కలిసిపోయారని కాంగ్రెస్ ఆరోపిస్తోందని... అదే నిజమైతే కవిత ఇంకా జైల్లో ఎందుకు ఉంటుంది? అని బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తీక్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... బీజేపీతో కేసీఆర్ కాంప్రమైజ్ అయితే కవిత ఇంకా జైల్లో ఉంటుందా? బీజేపీతో లాలూచీ పడ్డారని ఆరోపించడం సరికాదన్నారు. ఆమె 120 రోజులుగా జైల్లో ఉంటున్నారని గుర్తు చేశారు.

ప‌నిక‌ట్టుకుని కేసీఆర్‌పై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అక్క‌సు వెళ్ల‌గ‌క్కుతున్నాయని మండిపడ్డారు. ఈ రెండు జాతీయ పార్టీల వ్య‌వ‌హార‌శైలిని ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌న్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల శ్రేయ‌స్సు కోరే క‌వ‌చం బీఆర్ఎస్ పార్టీయే అన్నారు. బీజేపీతో ప‌ని చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో టీడీపీని వాడుకుంటూ బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. తెలంగాణ ఆత్మ‌గౌర‌వాన్ని తాక‌ట్టు పెడుతున్నారన్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌ను వంచించవద్దని సూచించారు. తెలంగాణ ఆత్మ‌గౌర‌వం కోసం ఎన్నో పోరాటాలు చేశారని, ఈ రెండు జాతీయ పార్టీల‌కు భ‌విష్య‌త్‌లో త‌ప్ప‌కుండా రాజ‌కీయ శిక్ష పడుతుందని హెచ్చరించారు.

రాబోయే రోజుల్లో చిత్రాలు చూస్తాం

మున్ముందు రాష్ట్ర రాజకీయాల్లో చాలా విచిత్రాలు చూస్తామన్నారు. సిద్ధాంతపరంగా వైరుధ్యాలు కలిగిన రెండు జాతీయ పార్టీలు రాష్ట్రంలో ఎలా పొత్తులో ఉన్నాయనేది తేలుతుందన్నారు. తెలంగాణ‌లో బీజేపీ-కాంగ్రెస్ పొత్తు నడుస్తోందని విమర్శించారు. తెలంగాణ ప్ర‌యోజ‌నాల‌ను తాక‌ట్టుపెట్టి స్వార్థ రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతున్నారన్నారు. బీజేపీ ప‌రోక్షంగా, ప్ర‌త్య‌క్షంగా కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తు ప‌లుకుతోందన్నారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డి నిన్న‌టికి నెల రోజులు అవుతోందని... ఈ నెల రోజుల్లోనే రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను ఆ పార్టీలు తుంగలో తొక్కాయన్నారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ పట్ల సానుకూలత ఉంటే బొగ్గు గనుల వేలాన్ని ఆపాలని సూచించారు.

నేను, మా అమ్మ పార్టీ మారబోం

తాను, తన తల్లి సబితా ఇంద్రారెడ్డి... ఇద్దరమూ పార్టీ మారబోమన్నారు. తాము బీఆర్ఎస్‌లోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. ఆ రోజు ప్రత్యేక పరిస్థితుల్లో కాంగ్రెస్ నుండి మారామని... కానీ రాజకీయ అవసరాల కోసం, పద‌వుల కోసం మారలేదని పేర్కొన్నారు. పార్టీలు మారే సంస్కృతి తమకు లేదన్నారు. తెలంగాణ‌లో క‌క్ష‌పూరిత రాజ‌కీయాలు కొన‌సాగుతున్నాయని ఆరోపించారు. తెలంగాణ‌లో కాంగ్రెస్... ఫిరాయింపుల‌కు పాల్పడుతోందన్నారు. ఇప్ప‌టికే ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీల‌ను కాంగ్రెస్‌లో చేర్చుకున్నారన్నారు. రాహుల్ గాంధీయేమో పార్టీ ఫిరాయింపులు స‌రికాదని చెబుతుంటే... రేవంత్ రెడ్డి తెలంగాణలో ఫిరాయింపుల‌కు పాల్ప‌డుతున్నారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News