Common Cobra: పాము నోట్లో ఇరుక్కుపోయిన దగ్గు మందు సీసా! ఇదిగో వీడియో

Cobra Swallows Cough Syrup Bottle In Odisha watch How It Was Rescued

  • కప్ప అనుకొని పొరబడి మింగపోయిన కోబ్రా
  • విషయం తెలిసి వెంటనే అక్కడకు చేరుకున్న స్నేక్ హెల్ప్ లైన్ వాలంటీర్లు
  • పాము కింది దవడను నెమ్మదిగా వెడల్పు చేస్తూ సీసా బయటకు వచ్చేలా సాయం చేసిన వైనం
  • ఒడిశాలోని భువనేశ్వర్ లో ఘటన.. వీడియోను పోస్ట్ చేసిన ఓ ఉన్నతాధికారి

సాధారణంగా పాములు ఎలుకలను లేదా కప్పలను మింగుతాయని తెలుసు. కానీ ప్లాస్టిక్ సీసాలను మింగడం మీరెప్పుడైనా చూశారా? ఓడిశా రాజధాని భువనేశ్వర్ లో ఇదే విచిత్రం జరిగింది. ఓ తాచుపాము ఏకంగా చెత్తలో పారేసిన ఖాళీ దగ్గు మందు సీసాను కప్పగా పొరబడింది. మింగబోయి ప్రాణంమీదకు తెచ్చుకుంది. చివరకు మింగలేక, కక్కలేక తెగ ఇబ్బందిపడింది. సీసా నోట్లో ఇరుక్కుపోవడంతో ఓవైపు నొప్పితో విలవిల్లాడుతూ మరోవైపు శ్వాస తీసుకొనేందుకు సైతం ఆయాసపడింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. సుశాంతా నందా అనే ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్, వైల్డ్ లైఫ్ తన ‘ఎక్స్’ ఖాతాలో ఈ వీడియోను పంచుకున్నారు. 

‘భువనేశ్వర్ లో కామన్ కోబ్రా రకం పాము దగ్గు మందును మింగాలని చూసి చివరకు కక్కలేక ఇబ్బందిపడింది. స్నేక్ హెల్ప్ లైన్ వాలంటీర్లు రిస్క్ తీసుకొని పామును కాపాడారు. దాని కింది దవడను నెమ్మదిగా వెడల్పు చేయడం ద్వారా సీసాను కక్కేలాగా చేసి ఒక విలువైన ప్రాణాన్ని కాపాడారు’ అని నందా ఆ వీడియో పోస్ట్ కింద క్యాప్షన్ పెట్టారు.

ఈ అంశం గురించి వైల్డ్ లైఫ్ వార్డెన్ సుభేందు మల్లిక్ వివరించారు. ‘మాకు విషయం తెలియగానే ఘటనాస్థలికి చేరుకున్నాం. మేము కొంత సాయం చేయడంతో ఆ పాము దగ్గు మందు సీసాను బయటకు కక్కగలిగింది. ఆహారంగా పొరబడటం వల్లే ఆ పాము సీసాను మింగింది. సీసా నోట్లో ఇరుక్కోవడం వల్ల ఆ పాము నొప్పితో బాధపడింది. దీనివల్ల అది చాలా నీరసించింది. నోట్లోంచి సీసా బయటకు వచ్చేశాక ఆ పామును అడవిలో విడిచిపెట్టాం’ అని మల్లిక్ వివరించారు.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు పామును కాపాడిన సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. వన్యప్రాణులు, పర్యావరణానికి హాని కలగించని రీతిలో చెత్తను పారబోసే పద్ధతులు అవలంబించాలని సూచిస్తున్నారు. మరికొందరేమో మనుషులు సృష్టించే సమస్యలకు ప్రాణకోటి ఇబ్బందులు పడుతోందని కామెంట్ చేశారు.

  • Loading...

More Telugu News