Revanth Reddy: కేసీఆర్‌పై ఈటలకు ప్రేమ తగ్గినట్లుగా లేదు... అందుకే ఆ మాటలు!: రేవంత్ రెడ్డి

Revanth Reddy satire on Etala Rajendar

  • ప్రధాని మోదీ, అమిత్ షాను కలిసిన అనంతరం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్
  • తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కోరినట్లు వెల్లడి
  • మోదీ, అమిత్ షా సానుకూలంగా స్పందించారని వ్యాఖ్య
  • ఎన్నికలప్పుడే రాజకీయాలు... ఆ తర్వాత కలిసి పని చేయాలన్న సీఎం
  • పీసీసీ అధ్యక్ష పదవి బాల్ ఏఐసీసీ కోర్టులో ఉందన్న ముఖ్యమంత్రి
  • టార్చ్ లైట్ వేసుకొని వెతికినా బీఆర్ఎస్ కనిపించదన్న రేవంత్  

బీజేపీ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ఇంకా ప్రేమ తగ్గినట్లుగా లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రి అమిత్ షా తదితరులను రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క కలిశారు. అనంతరం, మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... బీజేపీ నేతలు ఫిరాయింపులపై మాట్లాడటం విడ్డూరమన్నారు. 11 రాష్ట్రాల్లో బీజేపీ ఎంతోమందిని చేర్చుకొని అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో ప్రభుత్వాలు ఎలా ఏర్పడ్డాయో చెప్పాలన్నారు.

అసలు కేసీఆర్ పట్ల బీజేపీ నేతలు, ఈటలకు సానుభూతి ఎందుకో చెప్పాలన్నారు. ఈటల ఇప్పటికీ కేసీఆర్‌నే తన నాయకుడిగా అనుకుంటున్నట్లుగా ఉన్నాడని చురక అంటించారు. అయినా ప్రజలకు మేలు చేయడానికి తాము ఏం చేయాలో అదే చేస్తామన్నారు.

కేంద్రం సానుకూలంగా స్పందించింది

తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని తాము ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి కోరినట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్కతో కలిసి రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్ర పెద్దలను కలిశామన్నారు. రాజకీయాలు ఎన్నికల వరకేనని... ఆ తర్వాత కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు కలిసి పని చేయాలన్నారు. సత్సంబంధాలు కొనసాగాలని... అందుకే కేంద్రమంత్రులను కలిసి వినతిపత్రాలు ఇచ్చామన్నారు.

వారు కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు. వివిధ సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చినట్లు చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం పని చేయాలనే ఆకాంక్షతో కేంద్రమంత్రులను కలిసినట్లు చెప్పారు. తెలంగాణ ఎదుర్కొంటున్న పలు సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. కేంద్రమంత్రులు సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. 

మంత్రి వర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షపదవి బాల్ ఏఐసీసీ పరిధిలో...

మంత్రి వర్గ విస్తరణపై తాను ఎప్పుడూ తేదీని ప్రకటించలేదని రేవంత్ రెడ్డి చెప్పారు. త్వరలో కేబినెట్ విస్తరణ ఉంటుందని చెప్పారు. తన పీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఈ నెల 7న ముగియనున్నాయని, అందుకే కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయాలని ఏఐసీసీ పెద్దలను కోరినట్లు చెప్పారు. ఇప్పుడు ఈ అంశం ఏఐసీసీ కోర్టులో ఉందన్నారు.

టార్చ్ వేసుకొని వెతికినా బీఆర్ఎస్ లేదు

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఎక్కడా లేదని ముఖ్యమంత్రి అన్నారు. టార్చ్ లైట్ వేసి వెతికినా దొరకదని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ పుట్టిన 25 ఏళ్లలో ఇంతటి దీనావస్థలో ఎప్పుడూ లేదన్నారు. ఇక బీఆర్ఎస్ గత చరిత్రే... భవిష్యత్తు లేదని జోస్యం చెప్పారు. బీజేపీ అధికారంలో ఉన్న మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి ప్రజలు పట్టం కట్టారన్నారు. తమ పరిపాలనపై విమర్శలు చేసే ముందు బీజేపీ నాయకులు యూపీ, మహారాష్ట్రను పరిగణనలోకి తీసుకొని మాట్లాడాలని హితవు పలికారు.

  • Loading...

More Telugu News