Nadendla Manohar: కాకినాడలో ద్వారంపూడి మాఫియా భయంకరంగా విస్తరించి ఉంది: మంత్రి నాదెండ్ల

AP Minister Nadendla focus on ration rice illegal export

  • కాకినాడ కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ ఎగుమతులు
  • కాకినాడ పోర్టులో 35,404 మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్ చేశామన్న నాదెండ్ల
  • రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరిక

కాకినాడ కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ ఎగుమతుల అంశంపై ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి మాఫియా భయంకరంగా విస్తరించి ఉందని అన్నారు. అక్రమంగా బియ్యం ఎగుమతులకు కాకినాడ పోర్టును అడ్డాగా మార్చారని వెల్లడించారు. తనిఖీల సందర్భంగా ఒక్క కాకినాడ పోర్టులోనే 35,404 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశామని నాదెండ్ల తెలిపారు. కాకినాడ ఒక్కటే కాదు... రాష్ట్రవ్యాప్తంగా బియ్యం అక్రమాలు చేశారని ఆరోపించారు. 

దోపిడీపై సీఐడీ విచారణ జరిపిస్తామని, కలెక్టర్లకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తామని మంత్రి నాదెండ్ల వెల్లడించారు. అక్రమాలకు పాల్పడితే ఎవరినీ వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.  

ఈ మాఫియాలో ఎండీయూ వాహన యజమానులు కూడా భాగస్వాములుగా ఉన్నారని ఆరోపించారు. ఎండీయూ వాహన యజమానులను కొనసాగించాలా? వద్దా? అనే విషయమై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి నాదెండ్ల చెప్పారు. 

ఇక వైసీపీ హయాంలో రైతులకు భారీగా బకాయిలు పడ్డారని ఆరోపించారు. "జగన్ అరాచక పాలనతో రైతులు అనేక ఇబ్బందులతో చితికిపోయారు. వైసీపీ హయాంలో పౌరసరఫరాల శాఖను రూ.36,300 కోట్ల మేర అప్పులు పాల్జేశారు. రైతుల నుంచి కొన్న ఆహార ధాన్యాలకు వైసీపీ ప్రభుత్వం రూ.1,659 కోట్లు బకాయిలు పెట్టింది. తాజాగా, రైతుల బకాయిల చెల్లింపు కోసం సీఎం చంద్రబాబు రూ.1000 కోట్లు విడుదల చేశారు. 49,989 మంది రైతులకు తొలి విడతలో బకాయిలు చెల్లిస్తాం. నాణ్యత కలిగిన బియ్యాన్ని సరైన తూకంతో ప్రజలకు అందిస్తాం" అని వివరించారు.

  • Loading...

More Telugu News