Jagan: ఆ మనిషి మంచివాడు కాబట్టే ప్రజలు నాలుగుసార్లు గెలిపించారు: పిన్నెల్లికి జగన్ సపోర్ట్

Jagan visits Nellore Central Jail and talked to Pinnelli

  • నేడు నెల్లూరు సెంట్రల్ జైల్లో పిన్నెల్లిని పరామర్శించిన జగన్
  • ప్రజల్లో వ్యతిరేకత వల్ల వైసీపీ ఓడిపోలేదని వెల్లడి
  • ప్రజలకు మంచి చేసి వైసీపీ ఓడిపోయిందని ఆక్రోశం
  • చంద్రబాబు మోసపూరిత హామీలకు ప్రజలు ప్రభావితులయ్యారన్న వైసీపీ అధినేత
  • పిన్నెల్లిని అన్యాయంగా కేసుల్లో బిగించారని విమర్శలు

మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ నేడు నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించారు. అనంతరం జైలు వెలుపల మీడియాతో మాట్లాడారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై 307 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు పెట్టి అన్యాయంగా జైలులో నిర్బంధించారని మండిపడ్డారు. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఇవే కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. 

టీడీపీకి, చంద్రబాబుకు ఓటేయలేదన్న ఒకే ఒక్క కారణంతో ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని, దొంగ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. దాడులు చేసేది వీళ్లే... మళ్లీ  తమపైనే దాడులు చేస్తున్నారంటూ కేసులు పెట్టేదీ వీళ్లే అని జగన్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఇంత దారుణంగా పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు.

గత ఐదేళ్లలో జరిగిన వైసీపీ పాలనలో తాము కులం, మతం, ప్రాంతం చూడలేదని, చివరికి ఏ పార్టీకి ఓటు వేశారన్నది కూడా చూడకుండా... అర్హతనే ప్రామాణికంగా తీసుకుని ప్రతి ఒక్కరికీ మంచి చేశామని వెల్లడించారు. కానీ, టీడీపీ వాళ్లు ఎన్నికల్లో వాళ్లకు ఓటేయలేదని ఇవాళ రాష్ట్రాన్ని రావణకాష్ఠంలా చేస్తున్నారని అన్నారు. వైఎస్సార్ విగ్రహాలు కూడా ధ్వంసం చేస్తున్నారని, ఇవన్నీ కూడా శిశుపాలుని పాపాల మాదిరిగా పండుతాయని పేర్కొన్నారు. ప్రజలు చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పే రోజులు కూడా తొందర్లోనే ఉన్నాయని జగన్ వ్యాఖ్యానించారు. 

"ప్రజలు తనకు ఎందుకు ఓటు వేశారో చంద్రబాబు ఆలోచించుకోవాలి. ప్రజల్లో వ్యతిరేకత వల్ల వైసీపీ ఓడిపోలేదు. ప్రజలకు మంచి చేసి వైసీపీ ఓడిపోయింది. చంద్రబాబు ఇచ్చిన మోసపూరిత హామీలకు ప్రజలు ప్రభావితులయ్యారు. 10 శాతం మంది అటువైపు మళ్లడంతో చంద్రబాబు అధికారంలోకి రాగలిగారు. ఎన్నికల హామీలు నిలబెట్టుకోవడంలో చంద్రబాబు విఫలమయ్యారు. రైతు భరోసా, తల్లికి వందనం పథకాలు ఇప్పటివరకు ఇవ్వలేదు. 

18 ఏళ్లు పైబడిన ప్రతి అక్కచెల్లెమ్మకు నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తామన్నారు. రాష్ట్రంలో 2.10 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. నెలకు రూ.1500 ఎప్పట్నించి ఇస్తావంటూ ఈ మహిళలంతా చంద్రబాబును అడుగుతున్నారు. ముందు ఈ హామీలు నిలబెట్టుకోవడంపై చంద్రబాబు శ్రద్ధ చూపించాలి. ఇవేవీ చెయ్యకుండా కేవలం భయాందోళనలు సృష్టించాలి, దొంగ కేసులు పెట్టి ఇరికించాలి, ఆస్తులు ధ్వంసం చేయాలి, వైసీపీ మద్దతదారులను ఇబ్బందిపెట్టాలన్న దుర్మార్గపు ఆలోచనతో అడుగులు వేయడం హేయమైన రాజకీయం. 

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విషయంలోనూ ఇదే జరిగింది. అన్యాయమైన రీతిలో ఆయనపై కేసులు బిగించారు. గ్రామంలో ఉన్న ఎస్సీలు ఓటు వేసే పరిస్థితి లేకపోవడంతో, మా ఎమ్మెల్యే ఎస్పీకి ఫోన్ చేసినా స్పందన లేకపోయింది. సున్నితమైన ఏరియాలో ఉన్న ఆ బూత్ లో కేవలం ఒక హోంగార్డును సెక్యూరిటీగా పెట్టారు. ఆ బూత్ లో అన్యాయం జరుగుతుండడంతో ఎమ్మెల్యే లోపలికి వెళ్లి ఈవీఎం పగులగొట్టాడు. వైసీపీకే ఓట్లు పడుతుంటే ఎమ్మెల్యే వెళ్లి ఈవీఎంను పగులగొట్టాల్సిన అవసరం ఏముంది? అక్కడికి వెళ్లినప్పుడు జరుగుతున్న అన్యాయం చూశాడు కాబట్టే కదా ఈవీఎంను పగులగొట్టాడు! 

ఈవీఎంను పగులగొట్టిన కేసులో తనకు బెయిల్ వచ్చింది. ఇవాళ తను లోపల ఉంది ఈవీఎంను పగులగొట్టిన కేసులో కాదు... ఎమ్మెల్యే అక్కడికి వెళ్లి హత్యాయత్నం చేశాడంటూ నమోదైన కేసులో జైల్లో ఉన్నాడు. అక్కడ రిగ్గింగ్ చేస్తున్నది వాళ్లయితే, అడ్డుకోవడానికి వెళ్లిన ఎమ్మెల్యే హత్నాయత్నం చేస్తాడా? ఇలా చెప్పడానికైనా ఓ హద్దు ఉండాలి. ఈవీఎం ఘటన జరిగిన 10 రోజుల తర్వాత ఈ హత్యాయత్నం కేసు పెట్టారు. 

నిజంగానే హత్యాయత్నం జరిగి ఉంటే మే 17 నుంచి 20వ తేదీ వరకు విచారణ జరిపిన సిట్ తన నివేదికలో ఆ విషయం పేర్కొని ఉండేది కదా! అతడ్ని వేధించడానికే ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. ఆ మనిషి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ మనిషి స్థిరంగా గెలుస్తూ వస్తున్నాడంటే ఆ మనిషి మంచివాడు కాబట్టే కదా. ఆ మనిషి మంచివాడు కాబట్టే  ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చారు. అలాంటి వ్యక్తిని తీసుకువచ్చి ఇలా తప్పుడు కేసుల్లో ఇరికించడం ఎంతవరకు ధర్మం?" అని జగన్ ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News