Rolls Royce Ghost: వర్షపునీటిలో రోల్స్ రాయిస్ కారు బ్రేక్ డౌన్.. వీడియో వైరల్

RollsRoyce Ghost breaks down on waterlogged road

  • ఢిల్లీలోని ఓ రోడ్డుపై చిన్నపాటి వర్షపు నీటిని దాటలేక ఆగిపోయిన రోల్స్ రాయిస్ ఘోస్ట్ మోడల్ కారు
  • ఇతర కార్లు మాత్రం ఆగకుండా దూసుకెళ్లిన వైనం
  • వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి.. స్పందించిన నెటిజన్లు.. రకరకాల కామెంట్లతో సెటైర్లు

రోల్స్ రాయిస్.. ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన, విలాసవంతమైన కార్లలో ఒకటి. అందులోనూ రోల్స్ రాయిస్ ఘోస్ట్ మోడల్ కారు ధర ఏకంగా రూ. 6.95 కోట్ల నుంచి మొదలవుతుంది. ఇక హై ఎండ్ మోడల్ రేటు అయితే రూ. 7.95 కోట్ల పైమాటే. కానీ ఢిల్లీలో అంత డబ్బు పెట్టి ఆ కారు కొన్న ఓ యజమానికి తీవ్ర నిరాశే ఎదురైంది. 

ఎందుకంటే ఢిల్లీని తాజాగా ముంచెత్తిన భారీ వర్షానికి రోడ్డుపై నిలిచిన నీటిని దాటలేక ఇదిగో ఇలా ఆగిపోయింది. దీన్ని చూసి కొందరు వాహనదారులు అవాక్కవగా ఓ వాహనదారుడు తన మారుతీ సుజుకీ కారులోంచి వీడియో తీసి తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశాడు. దాని కింద ఓ క్యాప్షన్ కూడా పెట్టాడు. ‘ఎంత ఖరీదైన కారైనప్పటికీ అవసరమైనప్పుడు మనం నడపగలిగేలా ఉండాలి. ఢిల్లీలో వరదనీటితో నిండిన వీధుల్లో రోల్స్ రాయిస్ ఘెస్ట్ కారు ఇలా బ్రేక్ డౌన్ కావడం దురదృష్టకరం. కానీ దేశ రాజధానిలో మౌలిక వసతులు ఇలా ఉండటం మరింత విచారకరం’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఈ వీడియో కాస్తా ఒక్కసారిగా వైరల్ గా మారింది.

ఆ వీడియోలో ఇతర కార్లు సునాయాసంగా వర్షపు నీటిలోంచి దూసుకెళ్తుండగా రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారు మాత్రం బ్లింక్ అవుతున్న హజార్డ్ లైట్లతో అక్కడే నిలిచిపోయి కనిపించింది. కొందరు ద్విచక్ర వాహనదారులు ఆగిపోయిన తమ బైక్ లను తోసుకుంటూ రావడం కూడా కనిపించింది. 

ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. దీనికన్నా ఆల్టో కారు నయం అంటూ చాలా మంది అభిప్రాయపడ్డారు. ఇలాంటి కారును వర్షాకాలంలో నడిపితే జరిగేది ఇదేనంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు. ‘తక్కువ రేట్ల కార్లన్నీ ఇబ్బంది లేకుండా నీటిలోంచి వెళ్తుంటే దీనికేమైంది? అసలు లగ్జరీ కార్లకు వరదనీటిలో వెళ్లే సామర్థ్యం ఎంత ఉంటుంది?’ అంటూ మరొకరు స్పందించారు. ‘లగ్జరీ కార్లతో సమస్య ఏమిటంటే వరదనీటిలోకి రాగానే వాటికి ఆటోమెటిక్ గా బ్రేకులు పడిపోతాయి. ఇక కారు మెకానిక్ వచ్చే దాకా బ్రేకులు అలా పట్టేసి ఉంటాయి’ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ‘ఇతరులు వారి కార్లలో దూసుకెళ్తుంటే ఈ కారు నీటిలో ఆగిపోవడం సిగ్గుచేటు. అలాంటప్పుడు ఖరీదైన కారు కొనడంలో అర్థం ఏముంది?’ అని ఇంకొకరు అభిప్రాయపడ్డారు.

ఢిల్లీలో తాజాగా కురిసిన భారీ వర్షాలకు నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై ఎక్కడ చూసినా వర్షపు నీరు నిలిచిపోవడం, చెట్లు కూలడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు పోలీసులు నానా అవస్థలు పడ్డారు.

View this post on Instagram

A post shared by Car Crazy India® (@carcrazy.india)

More Telugu News